విశాఖకు వెళ్లడానికి జగన్ రెడీ

May 26, 2020

తమ నాయకుడి నిర్ణయాన్ని సమర్థించుకోవడంలో జగన్ టీంకు వంద మార్కులు ఎపుడూ తగ్గవు అంటే నమ్మండి. జగన్ ఏం చెప్పినా వారికి శాసనం. జగన్ ఏం చేసినా వారికి అద్భుతం. పార్టీలో సొంత అభిప్రాయానికి తావే లేదు. దిసీజ్ వాస్తవం. 

తాజాగా విశాఖ నుంచి పాలన అనే అంశంపై ఏపీ మంత్రి పెద్ది రెడ్డి ఫుల్ క్లారిటీ ఇచ్చారు. బడ్జెట్ సమావేశాలు ముగిసిన వెంటనే విశాఖ కేంద్రంగా ముఖ్యమంత్రి పరిపాలన కొనసాగిస్తారని అన్నారు. అసలు ముఖ్యమంత్రి గారికి మూడు రాజధానుల ఐడియా ఎలా వచ్చిందో గాని భలే వచ్చింది. అబ్బబ్బబ్బ... అద్భుతం అన్నారు. అమరావతిలోనే రాజధాని కనుక కొనసాగించి ఉంటే... ఇంత మంచి స్పందన ఉండేది కాదని వాకృచ్ఛారు ఈ మంత్రి గారు. జగన్ తీసుకున్న నిర్ణయం చాలా మంచిదని బల్లగుద్ది చెప్పారు. 

ఇక కార్యాలయాల తరలింపు గురించి కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. అవి ఒక పద్ధతి ప్రకారం తరలిస్తామని అన్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు ఖాయం అని చెప్పారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి కొత్త లాజిక్ చెప్పారు... అసలు ఎక్కడినుంచి అయినా పాలించే అధికారం ముఖ్యమంత్రికి ఉంటుంది. అది ఆయన ఇష్టం అని చెప్పుకుచ్చారు. పాపం... ఈ మాట చెప్పేటపుడు కేసీఆర్ ప్రభావం ఈ మంత్రిగారి మీద గట్టిగా ఉందని చెప్పాలి. 

కొసమెరుపు: తన స్వామి భక్తి కోసం చిత్తూరు జిల్లా వాళ్లు 1000 కిలోమీటర్లు వెళ్లొచ్చినా పర్లేదు గాని... జగన్ మనసు మాత్రం ఇసుమంతయినా బాధపడకూడదు అన్నదే పెద్దిరెడ్డి సిద్ధాంతం.