వైసీపీ ఎమ్మెల్యే గాయబ్... ఏమయ్యాడు? ఎక్కడున్నాడు?

February 26, 2020

రాజధాని మార్పు... ఏపీలో కలకలానికి దారితీసిన సంగతి తెలిసిందే. అయితే... ఈ గొడవ మొదలైనప్పటి నుంచి ఒక ఎమ్మెల్యే ప్రజలకు కనిపించకుండా పోయారు. ఆయనే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్నారెడ్డి. మొన్నటి వరకు అవకాశం దొరికినపుడల్లా చంద్రబాబు మీద, తెలుగుదేశం మీద ఎగిరెగిరి పడిన ఆళ్ల... ఎపుడైతే అసెంబ్లీలో జగన్ రాజధానుల గురించి సంచలన ప్రకటన చేశారో ఆరోజు నుంచి ఆయన గాయబ్ అయ్యాడు. అమరావతి తరలింపు అనేది ఏ టీడీపీ వాళ్లకు పరిమితం అయిన విషయం కాదు.. కృష్ణా, గుంటూరు జిల్లాలో ప్రజలందరికీ షాక్ కు గురిచేసింది. ముఖ్యంగా అమరావతి నగరం ఉన్న మంగళగిరి నియోజకవర్గం ప్రజలకు రాజధాని తరలింపు తీవ్రమైన కోపం తెప్పించింది.

తాను కనిపిస్తే ప్రజలు నిలదీస్తారని... దాడి చేసినా చేస్తారని భావించిన ఆళ్ల అసలు కనిపించడమే మానేశాడు. అతను ఎక్కడున్నారో ఎవ్వరికీ తెలియడం లేదు. చివరకు అతని ఆచూకీకోసం మంగళగిరి ప్రజలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజధాని విషయం మా గోడు చెప్పుకోవడానికి ఎమ్మెల్యే కోసం వెతుకుతున్నాం. ఆయన నేరుగా గాని, ఫోనులో గాని అందుబాటులో లేరు. దయచేసి ఆయన ఆచూకీ తెలపండి అంటూ ఆ ప్రాంత ప్రజలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంట్లో కూడా లేరు. పొలంలో కూడా లేరు. ఆయన ఆచూకీ తెలిపితే మా బాధలు చెప్పుకొంటాం అంటూ వారు పోలీసులను కోరారు.