కర్ఫ్యూ వేళలోనూ రోడ్ల మీదకు వస్తున్నారు.. ఏం చేద్దాం?

August 07, 2020

కరోనా వేళ.. వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు వీలుగా తెలంగాణ వ్యాప్తంగా ఉదయం లాక్ డౌన్.. సాయంత్రం ఐదు గంటల నుంచి కర్ఫ్యూను అమలు చేస్తున్న వైనం తెలిసిందే. అయినప్పటికీ.. రోడ్ల మీదకు వచ్చే వారి సంఖ్యను కంట్రోల్ చేసే విషయంలో పోలీసులు కిందామీదా పడుతున్నారు. ఎంత ప్రయత్నించినా.. రోడ్ల మీదకు వచ్చే వారిని కట్టడి చేయలేని పరిస్థితి. ఇలాంటివేళ.. మరిన్నికఠిన నిర్ణయాల్ని తీసుకునే దిశగా తెలంగాణ సర్కారు కసరత్తు చేస్తుందా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది.
ఇప్పటివరకూ నోటి మాటలే తప్పించి.. కఠిన చర్యల్ని తీసుకుంటున్నది లేదు. నిబంధనలకు విరుద్ధంగా బయటకు వస్తున్న వాహనాలపై చర్యలు తీసుకోవటం.. జరిమానాలు విధించటమే తప్పించి..కఠినంగా చట్టాల్ని ప్రయోగించింది లేదు. తాజాగా వెలుగు చూస్తున్న రిపోర్టులు.. వైరస్ వ్యాప్తిని కంట్రోల్ చేయటంలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా.. రానున్న రోజుల్లో పరిస్థితి మరింత చేయి దాటిపోతుందన్న విషయాన్ని గుర్తు చేసుకుంటున్న కేసీఆర్ ప్రభుత్వం.. ఆ దిశగా మరిన్ని ప్రయత్నాలు చేస్తోంది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ప్రస్తుతం రాష్ట్రాల సరిహద్దుల వద్ద ఎలా అయితే కఠిన నిబంధనల్ని అమలు చేస్తున్నారో.. అదే విధానాన్ని తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలకు అమలు చేస్తారని చెబుతున్నారు. అలా చేయటం ద్వారా.. రోడ్ల మీదకు ప్రజలు రాకుండా కట్టడి చేసే అవకాశం ఉందంటున్నారు. 21 రోజులు ఇళ్ల దగ్గరే ఉండాల్సి రావటంతో.. ఎవరికి వారు వారికి తోచినట్లుగా ఊళ్లకు వెళ్లాలన్న ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి వారు పలు సాకులు చెబుతున్నారు. ఎవరి సౌకర్యం వారు చూసుకుంటున్నారే తప్పించి.. వైరస్ వ్యాప్తి ముప్పును పట్టించుకోవటం లేదు. ఇలాంటివేళ.. కఠిన చర్యలు తీసుకోవటం మినహా మరో మార్గం లేదంటున్నారు. మొత్తంగా చూస్తే.. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల్నిపాటించకుండా ప్రజలు కష్టాలు తమకు తాముగా కొని తెచ్చుకుంటున్నారని చెప్పక తప్పదు.