కరోనాతో సహజీవనం... జగన్ తొలి విజయం నమోదు

May 31, 2020

కరోనా నివారణ మన చేతులు దాటిపోయింది. దాంతో సహజీవనం తప్పదు. ఇక ఎవరికి వారు జాగ్రత్త పడాల్సిందే అని జగన్ చెప్పారు. జగన్ ఇలా చేతులు ఎత్తేస్తాడని చాలా మంది ఊహించినట్లే జరిగింది. దేశంలో 20 ప్రమాదకరమైన జిల్లాల్లో ఏపీలోని 3 మోస్ట్ పాపులేటెడ్ జిల్లాలు ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో ఊహించుకోవచ్చు. దురృష్టం ఏంటంటే ముంబై, ఢిల్లీ వంటి నగరాలను కూడా జిల్లాలుగా లెక్కేసినా కూడా మన జిల్లాలు టాప్ 20 లో ఉన్నాయి. మరి ఉండవా... కర్నూలులో 500 కి రీచ్ అయ్యాయి కేసులు. గుంటూరు, కృష్ణాలో 300 దాటేశాయి ఒక్కోదాంట్లో. ఇలాంటి పరిస్థితిలో కరోనా అరికట్టేందుకు ఏ అవకాశాన్ని జగన్ వదులుకోకూడదు. ఎందుకంటే ఏపీ డేంజర్లో ఉంది. 

అయితే, ఎప్పటిలాగే జగన్ అంచనాలు మరోసారి ఫెయిలయ్యాయి. 40 రోజుల అనంతరం లిక్కర్ షాపులు ఓపెన్ చేస్తే జనం ఎలా ఎగబడే అవకాశం ఉందో కనీసం ఊహించలేకపోతే ఎలా, సామాజిక దూరానికి ఏర్పాట్లు చేయకపోతే ఎలా... ఇది మినిమం కామన్ సెన్స్. ప్రభుత్వం దగ్గర ఎలాంటి ప్రణాళిక లేకపోవడం వల్ల మద్యం షాపుల రీఓపెన్ డిజాస్టర్ అయ్యింది. ఇది ఎంత పెద్ద ప్రమాదానికి దారితీస్తుందో ఊహించుకుంటేనే భయంకరంగా ఉంటుందని చంద్రబాబు నాయుడు జగన్ పై విమర్శలు చేశారు. 

నిజమే... ఎన్నికలు, పండగలపుడు రెండు మూడు రోజులు మందు బంద్ చేస్తేనే జనం ఎగబడతారు. అలాంటిది.. 50 రోజులు (ఎన్నికల కోసం ఏపీలో ముందే బంద్ చేశారు) మందు లేనపుడు సడెన్ గా ఓపెన్ చేస్తే అది ఎలాంటి ప్రమాదాలకు దారితీస్తుందో ఒక ముఖ్యమంత్రి ముందే అంచనా వేయాల్సిన బాధ్యత జగన్ పై ఉంది. కానీ అందులో జగన్ విఫలం అయ్యాడు. ఈ వైన్ షాపుల వద్ద అనూహ్యమైన రద్దీ చూస్తుంటే... ఏపీలో ప్రతి ఊరు ప్రతి వాడ రెడ్ జోన్ గా మారి ఏపీ మొత్తం డేంజర్ జోన్ గా మారే ప్రమాదం లేకపోలేదు. ఈ విషయాన్ని  పసిగట్టకపోవడం వల్ల జనం ప్రతిచోటా పోటెత్తారు. వీరిలో ఏ ఒక్కరికి కరోనా ఉన్నా మూడో దశలోకి వెళ్లిపోతాం. ఈ ప్రమాదం సంభవించడానికి ఒక్క రోజు చాలు. ఇప్పటికే మూడు నాలుగు జిల్లాల్లో పరిస్థితి మూడో దశలో ఉంది. ఇపుడు జాగ్రత్త పడకపోతే ఏపీ కోలుకోవడం కష్టం. 

ఈ మందు కోసం జనం రోజూ ఇలాగే ఎగబడితే.. 2 రోజుల్లో ఏపీ స్మాష్. ఇప్పటికే మన దేశాన్ని కబళించడానికి జీవాయుధాల్లాగా కొందరు తమలో కరోనా పెట్టుకుని అంతటా తిరుగుతున్నారు. బహుశా వాళ్లకు ఉద్దేశం ఉండొచ్చు లేకపోవచ్చు. ఉద్దేశం ఉన్నా లేకపోయినా కలిగే నష్టం మారదు. ఇప్పటికైనా జగన్ జాగ్రత్త పడి రద్దీని కంట్రోల్ చేయడమో, డోర్ డెలివరీ ఇవ్వడమో చేయకపోతే.... పరిస్థితి ఘోరంగా ఉంటుంది. జగన్ చెప్పినట్లు కొందరు కాదు.. అందరు కరోనాతో సహజీవనం చేయాల్సి వస్తుంది. ఇప్పటికే కొందరు జగన్ మందు షాపులు ఓపెన్ చేయడం ద్వారా కరోనాతో సహజీవనం చేయించడంలో తొలి అడుగు విజయవంతంగా వేశాడని కామెంట్లు చేస్తున్నారు. వెంటనే మేల్కోవాలి మనం. లేకపోతే ప్రమాదం తప్పదు.