కోలీవుడ్, టాలీవుడ్లో సంచలనం

February 24, 2020

తండ్రిది వియ‌త్నాం. త‌ల్లిది పుదుచ్చేరి. ఎక్కువ పేరు తెచ్చిందేమో తెలుగు సినిమాలు. ఫైట్ మాస్ట‌ర్ పీట‌ర్ హెయిన్ నేప‌థ్య‌మిది. పుట్టింది ఇండియాలోనే అయినా.. తండ్రి దేశ‌మైన వియ‌త్నాంకు వెళ్లి మార్ష‌ల్ ఆర్ట్స్ స‌హా అనేక ఫైట్ల‌లో ఆరితేరి.. ఆ నైపుణ్యాన్నంతా ఇండియ‌న్ సినిమాల్లో చూపిస్తూ శ‌ర‌వేగంగా ఎదిగాడు పీట‌ర్. బాహుబ‌లి, మ‌న్యంపులి, రోబో, మ‌గ‌ధీర‌, అప‌రిచితుడు.. ఇలా ఎన్నో భారీ చిత్రాల్లో అద్భుత‌మైన యాక్ష‌న్ ఘ‌ట్టాల్ని తీర్చిదిద్ది లెజెండ‌రీ స్టేట‌స్ సంపాదించాడ‌త‌ను. జాతీయ అవార్డుల్లో రెండేళ్ల కింద‌ట తొలిసారి ప్ర‌వేశ‌పెట్టిన ఉత్త‌మ యాక్ష‌న్ కొరియోగ్రాఫ‌ర్ పుర‌స్కారాన్ని మొద‌ట‌గా అందుకున్న‌ది పీట‌రే. ఇప్పుడ‌త‌ను ద‌ర్శ‌క‌త్వం చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతుండ‌టం విశేషం. టాలీవుడ్ నిర్మాత న‌ల్ల‌మ‌లుపు శ్రీనివాస్ (బుజ్జి) పీట‌ర్‌ను ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేయ‌నున్నాడు.
సినీ రంగంలో వేరే విభాగాల్లో ఎంత పేరు సంపాదించినా.. ద‌ర్శ‌కుడిగా మారి కెప్టెన్ ఆఫ్ ద షిప్ అనిపించుకోవాల‌ని అంద‌రికీ ఉంటుంది. ఈ దిశ‌గా ఎంద‌రో టెక్నీషియ‌న్లు ప్ర‌య‌త్నాలు చేశారు. థ్రిల్ల‌ర్ మంజు స‌హా ఫైట్ మాస్ట‌ర్లు కొంద‌రు ద‌ర్శ‌కులుగా త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకున్నారు. పీట‌ర్ హెయిన్ కూడా ద‌ర్శ‌కుడు కావాల‌న్న‌ది త‌న క‌ల అని చాలా ఏళ్ల ముందే చెప్పాడు. త‌నకు ఒక డ్రీమ్ ప్రాజెక్టు కూడా ఉన్న‌ట్లు తెలిపాడు. ఆ క‌ల‌ల సినిమాను నిర్మించ‌డానికి బుజ్జి ముందుకొచ్చాడు. పీట‌ర్ హెయిన్ చెప్పిన క‌థ విన‌గానే న‌చ్చింద‌ని.. క‌థ, అది టేకాఫ్ అయ్యే విధానం అద్భుతంగా అనిపించాయ‌ని.. అందుకే వెంట‌నే ఓకే చెప్పాన‌ని.. ద‌స‌రాకు ఈ సినిమాను లాంఛ‌నంగా ప్రారంభిస్తామ‌ని బుజ్జి చెప్పాడు. ఇంకా ఆర్టిస్టుల ఎంపిక జ‌ర‌గ‌లేద‌ని.. త‌మ బేన‌ర్లో ఓ గొప్ప సినిమాగా ఇది నిలుస్తుంద‌ని బుజ్జి ధీమా వ్య‌క్తం చేశాడు.