మీ రాజ్యంలో ఇలాంటి బాదుడా జగన్?

May 26, 2020

అడగకున్నా వరాలు ఇచ్చే పాలకులు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చేశారు. దేశంలోని మరే రాష్ట్రంలో లేని విధంగా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు.. పండుగలు.. పర్వదినాల సందర్భంగా ప్రత్యేక తాయిలాలు ఇచ్చే తెలుగు రాష్ట్రాల్లో.. ప్రజల మీద అదే స్థాయిలో భారం మోపే సరికొత్త ఎత్తుడగలకు తెర తీస్తున్నాయి ఆయా ప్రభుత్వాలు.
దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో పెట్రోల్.. డీజిల్ మీద విధించే పన్ను రేట్లు తక్కువగా ఉంటే.. అందుకు భిన్నంగా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ భారం ప్రజల మీద భారీగా ఉంటోంది. ఇప్పటికే అమలు చేస్తున్న పన్నురేట్లను మరింత పెంచుతూ నిర్ణయం తీసుకోవటం ఇప్పుడు ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పలు సంక్షేమ పథకాలతో దూసుకెళుతున్న ఏపీ ముఖ్యమంత్రి వరాల దేవుడిగానే కాదు.. బాదుడు మహారాజు అన్న భావన కలిగేలా ఆయన ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ఉంది.
తాజాగా పెట్రోల్.. డీజిల్ పై పన్ను రేట్లను సవరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ సవరణ కారణంగా పెట్రోల్.. డీజిల్ ధరలు పెరగటమే కాదు.. ఆ మందంలో ప్రజల మీద ప్రభావం చూపనుంది. తెలంగాణతో పోలిస్తే.. ఏపీలో పెట్రోలు.. డీజిల్ లీటరుపై విధిస్తున్న పన్నుతో పాటు.. లీటరుకు రూ.2 స్థిర ధరను వసూలు చేస్తున్నారు. తాజాగా స్థిర ధరగా వసూలు చేసే రూ.2 స్థానే.. పన్ను రేట్లను సవరిస్తూ నిర్ణయం తసీుకున్నారు. దీని కారణంగా ప్రజల మీద మరింత భారం పడనుంది.
పెట్రోల్ మూలధర లీటరుకు రూ.2 వసూలుచేస్తున్న స్థానే.. దానిపై విధించే పన్ను ధరను పెంచారు. దీని కారణంగా స్వల్పంగా ధర పెరగనుంది. అంతేకాదు.. రానున్న రోజుల్లో పెట్రోల్... డీజిల్ ధరలు పెరిగిన ప్రతిసారీ పన్ను రేటు పెరిగిన కారణంగా ప్రజల మీద ఆ భారం అంతకంతకూ పెరిగే వీలుందని చెబుతున్నారు. వరాల వర్షం కురిపిస్తున్న జగన్ ప్రభుత్వం.. నిత్యవసర వస్తువులైన పెట్రోల్.. డీజిల్ లాంటి వాటిపై పన్ను ధరల్ని వీలైనంత తగ్గించి.. మిగిలిన రాష్ట్రాలతో పోటీ పడటం పోయి.. ఇలా పెంచటం ఏమిటన్న ప్రశ్న పలువురు వ్యక్తం చేస్తున్నారు.