అమరావతి తరలింపుపై హైకోర్టు లో కేసు

February 25, 2020

అసెంబ్లీలో ఏపీ ముఖ్యమంత్రి జగన్... మూడు రాజధానులంటూ చేసిన ప్రకటన ఏపీలో కలకలానికి దారితీసింది. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర ప్రజల మధ్య తీవ్రమైన విద్వేషాలు సృష్టించేలా ఉండటంతో ఈ నిర్ణయం వల్ల అమరావతికి చెందిన రైతులు అందరూ అన్యాయం అవుతారు అన్నది పిటిషనర్ వాదన.

స్వయంగా ప్రధాని భూమి పూజ చేశారని, ఇప్పటికే గెజిట్ నోటిఫికేషన్ విడుదల అయ్యింది, సచివాలయం, అసెంబ్లీ అన్నీ ఉన్నాయి కాబట్టి... అమరావతిని తరలించకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. ప్రభుత్వాన్ని, సీఆర్డీఏను అమరావతిని మార్చకుండా ఆదేశాలివ్వాలని అమరావతికి చెందిన రైతులు ఈ పిటిషను వేశారు. కౌంటరు దాఖలు చేయడానికి కోర్టు నాలుగు వారాల సమయం ఇచ్చింది.

ఇదిలా ఉంటే... జగన్ ప్రకటన అనంతరం అమరావతి రైతుల్లో తీవ్రమైన ఆందోళన ఉంది. గుంటూరు, కృష్ణా జిల్లాల ప్రజలు రాజధాని తరలిపోతుందని ఆవేదన చెందుతున్నారు. అమరావతి రాకతో రెండు జిల్లాల్లో భారీ ఎత్తున రియల్ ఎస్టేట్ పుంజుకుంది, కొత్త పరిశ్రమలు, విద్యాసంస్థలు వచ్చాయి. కొత్త ఉద్యోగాలు వచ్చాయి. ఇపుడు రాజధాని మారిపోతే రెండు జిల్లాల ఆర్థిక వ్యవస్థపైన, గుంటూరు, విజయవాడ నగరాలపైన తీవ్ర ప్రతికూల ప్రభావం పడనుంది.