బోస్ లాంటోళ్లు అలా మాట్లాడటమా? ఆయన మాటల్లో నిజమెంత?

August 13, 2020

దరిద్రపుగొట్టు రాజకీయాలు అని ఛీదరించుకున్నా.. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ వ్యవస్థకు మించిన శక్తివంతమైనది మరేదీ కాదన్నది మర్చిపోకూడదు. చూసేందుకు ఇతర వ్యవస్థలు శక్తివంతమైనట్లు కనిపించినా.. అందరిని అంతో ఇంతో ప్రభావితం చేయటమే కాదు.. ప్రజల అండ రాజకీయానికే ఉంటుంది.

ఈ కారణంతోనే.. ఎంత వద్దనుకున్నా రాజకీయం ప్రజల జీవితాలను నీడలా వెంటాడుతూనే ఉంటుంది. ఇలాంటి రాజకీయంలోనూ కొందరు మంచి నేతలు ఉంటారు. చాలామంది బరితెగింపు నేతలకు భిన్నంగా కాస్త విలువలను పాటిస్తారు.

ఈ కారణంతోనే పార్టీలను తప్పు పట్టేవారు సైతం.. సదరుపార్టీలోని కొందరి నేతల్ని పల్లెత్తు మాట అనటానికి ఇష్టపడరు. ఏపీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆ కోవకే చెందుతారు. వివాదాలకు దూరంగా ఉండటం ఆయనకు అలవాటు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించే వారిలో చాలామంది పిల్లి సుభాష్ విషయంలో పల్లెత్తు మాట అనేందుకు ఇష్టపడరు. దీనికి తగ్గట్లే తనకున్న ఇమేజ్ ను డ్యామేజ్ చేసుకునేలా ఆయన వ్యవహరించరు. కానా తాజా సీన్ రివర్స్.

ఏపీ శాసనమండలిలో రచ్చ జరిగిన తర్వాత మాట్లాడిన మంత్రి పిల్లి నోటి నుంచి వచ్చిన మాటలు షాకింగ్ గా మారాయంటున్నారు. ఎందుకంటే.. పిల్లి నుంచి అలాంటి మాటల్ని ఎవరూ ఊహించకపోవటమే కారణంగా చెబుతున్నారు.

ఇంతకీ ఆయన ఏమన్నారంటే.. ‘‘ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదిస్తే తప్పించి ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి. ప్రభుత్వ ఖజానా నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేం. ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో పెట్టాలన్న ఆలోచనతోనే టీడీపీ అలా వ్యవహరించింది’’ అని వ్యాఖ్యానించారు. ఆయన నోటి నుంచి ఈ మాట విన్నంతనే.. టీడీపీ అంత దుర్మార్గంగా వ్యవహరించిందా? అన్న సందేహం  కలుగక మానదు.

కానీ.. రూల్ బుక్ లోని అంశాలతో పాటు.. నిపుణులు చెప్పే మాటల్ని చూస్తే.. పిల్లి చెప్పిన మాటలకు పొంతన లేని రీతిలో ఉండటం గమనార్హం. ద్రవ్య వినిమయ బిల్లు ప్రవేశ పెట్టని నేపథ్యంలో జులై ఒకటిన ప్రభుత్వ ఉద్యోగులకు జీత భత్యాలకు చెల్లించలేమా? అన్న ప్రశ్నకు సమాధానం చూస్తే.. మండలికి వచ్చిన రోజు నుంచి 14 రోజుల్లో అక్కడ ఆమోదం పొందినా.. పొందకున్నా అది కాస్తా ఆమోదించినట్లే పరిగణిస్తారని చెబుతున్నారు.

పార్లమెంటులో కానీ.. రాష్ట్ర శాసన వ్యవస్థలో కానీ వినిమయ బిల్లుకు దిగువసభలో ఆమోదమే కీలకమన్నది మర్చిపోకూడదు. లోక్ సభలో వినమయ బిల్లు ఆమోదం పొంది రాజ్యసభకు వెళ్లిన తర్వాత.. దాన్ని యథాతధంగా పంపటం కానీ.. మార్పులు చేసి పంపటం కానీ చేయాలి.

ఒకవేళ.. దాన్ని పక్కన పెట్టినా.. రాజ్యసభకు వెళ్లిన 14వ రోజుకు దాన్ని తిప్పిపంపకుంటే.. అది కాస్తా ఆమోదం పొందినట్లే భావిస్తారు. ఇలాంటి నిబంధనేరాష్ట్రాలకు ఉంది. 

ప్రభుత్వ ఉద్యోగుల జీతాల విషయానికి వస్తే.. నెలాఖరునాటికి ఓకే అవుతుంది. కాదనుకుంటే ఒకట్రెండు రోజులు ఆలస్యమవుతుంది. అలా జరగకూడదంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఉండే ఆర్డినెన్సు అస్త్రాన్ని మరోసారి సంధిస్తే సరిపోతుంది.

అంతేకానీ.. మంత్రి చెప్పినట్లు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏ మాత్రం ఎదురు కాదన్నది మర్చిపోకూడదు. ఇదంతా చూసినప్పుడు.. ఏపీ మంత్రి పిల్లి సుభాష్ సాబ్ చెప్పిన మాటల్లోనిజం లేదనిపించక మానదు. లేని విషయాన్నితేనట్లుగా చెబితే ఫర్లేదు.

అందుకుభిన్నంగా ఉన్న విషయాన్ని లేదని చెబితే ఎలా అన్నది ప్రశ్న. పిల్లి సాబ్ లాంటి వారి నుంచి ఎవరూ ఇలాంటివి ఆశించరు కదా? ఆయన ఎందుకలా మాట్లాడినట్లు?