టీఆర్ఎస్ నిర్ణయాలతో పుంజుకున్న బీజేపీ

July 20, 2019

ముందుస్తు ఎన్నికల ఫలితాలో తెలంగాణలో ఢీలా పడిన కాంగ్రెస్‌కు లోక్‌సభ ఎన్నికల్లో మరో షాక్ తగలబోతుందా..? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈనెల 11న జరిగిన పార్లమెంటు ఎన్నికల పోలింగ్‌ సరళి, స్థానిక రాజకీయ వర్గాల సమాచారంపై చర్చకు ఊతమిచ్చే విధంగా ఉంది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు గానూ.. హైదరాబాద్‌ స్థానంలో వన్‌మ్యాన్‌షోగా మజ్లిస్‌ హవా నడుస్తుందనే విషయం తెలిసిందే. ఇక మిగిలిన 16 స్థానాలను దక్కించుకోవాలనుకుంటోంది అధికార తెలంగాణ రాష్ట్ర సమితి. ఇందుకోసం ఆ పార్టీ ఎన్నో వ్యూహాలు అమలు చేసింది. ముఖ్యంగా కాంగ్రెస్‌ను దెబ్బకొట్టేందుకు వలసలను ప్రోత్సహించడం చేసింది. అయితే, ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీని లైట్ తీసుకుంది. అసలు ఆ పార్టీ ప్రభావం రాష్ట్రంలో కనిపించదనే నమ్మకంతో టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్‌నే టార్గెట్ చేశారు. ఇప్పుడిదే భారతీయ జనతా పార్టీకి లాభం చేకూర్చిందని తెలిసింది.

ఎంఐఎం స్థానాన్ని మినహాయిస్తే మిగిలిన 16 స్థానాల్లో ఆరింట బీజేపీ టీఆర్‌ఎస్‌కు గట్టిపోటీ ఇచ్చి కాంగ్రెస్‌ కన్నా ఎక్కువ ఓట్లు దక్కించుకుంటుందని పరిశీలకులంటున్నారు. ఇందులో సికింద్రాబాద్, మహబూబ్‌నగర్, జహీరాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్‌ స్థానాలున్నాయని తెలుస్తోంది. గెలుపోటములను పక్కన పెడితే 6 చోట్ల బీజేపీ గట్టి పోటీ ఇచ్చిందనే టాక్ వినిపిస్తోంది. అయితే, రాష్ట్రంలోని 17 స్థానాలకూ పోటీ చేసిన కమలం పార్టీకి కేవలం ఒకే ఒక్క స్థానంలో గెలిచే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అదే సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం అని గతంలోనే చెప్పుకున్నాం. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేసిన బీజేపీ ఈ స్థానాన్ని దక్కించుకుంది. ఇక్కడి నుంచి కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ విజయం సాధించారు. అయితే, ఈ ఎన్నికల్లో ఊహించని విధంగా బీజేపీ ఆయనను పక్కన పెట్టేసింది. అంతేకాదు, ముందస్తు ఎన్నికల్లో ఓడిపోయిన కిషన్‌రెడ్డికి అవకాశం కల్పించింది. ఇప్పుడాయనకు విజయావకాశాలు ఉన్నాయని అంటున్నారు.

మరోవైపు, రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఉన్న పరిస్థితిని బట్టి లోక్‌సభ ఫలితాలు తారుమారైతే మాత్రం కోలుకునే పరిస్థితులు ఇప్పట్లో లేవనేది బహిరంగ రహస్యమే. వందల సంఖ్యలో కేడర్‌ను, పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను కోల్పోయిన ఆ పార్టీ లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొనేందుకే ఆపసోపాలు పడాల్సి వచ్చింది. ముఖ్యంగా పార్టీ ఇంటి మనుషుల్లాంటి పొంగులేటి సుధాకర్‌రెడ్డి, రాపోలు ఆనందభాస్కర్‌, డీకే అరుణ లాంటి నాయకులు కూడా పార్టీని వీడివెళ్లిపోవడం, పార్టీ నాయకత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేయడం మొదట్నుంచీ పార్టీ జెండా మోసిన కేడర్‌ను నైరాశ్యంలోకి నెట్టింది. దీనికితోడు గాంధీ కుటుంబానికి వీరవిధేయుడైన వీహెచ్‌ లాంటి నేతలు కాంగ్రెస్‌లో సామాజిక న్యాయం అమలు కావడం లేదని, రాహుల్‌గాంధీకి జ్ఞానోదయం కావాలని తాజాగా వ్యాఖ్యలు చేసిన తీరు ఆ పార్టీ పరిస్థితికి అద్దం పడుతోంది. ఈ పరిణామాలన్నింటి వల్ల తెలంగాణలో బీజేపీ ఊహించని రీతిలో బలపడుతుందనేది విశ్లేషకుల అభిప్రాయం.