రేపు మోడీ టాపిక్ ఏంటో తెలుసా?

August 08, 2020

ప్రస్తుతం భారత్ లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న సంగతి తెలిసిందే. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు అన్ని రాష్ట్రాల్లోనూ పెరుగుతుండడంతో కేంద్రం ఆందోళన చెందుతోంది. ముఖ్యంగా ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో తబ్లీఘీ జమాత్ సదస్సులో పాల్గొన్న వారి ద్వారా పలు రాష్ట్రాలకు వైరస్ వ్యాప్తి చెంది ఉంటుందన్న నేపథ్యంలో కేంద్రం కలవరపడుతోంది. ఈ నేపథ్యంలోనే రేపు అన్ని రాష్ట్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని నిర్ణయించుకున్నారు.

దేశంలో కరోనా వేగంగా వ్యాప్తి చెందడం, కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మోడీ మాట్లాడనున్నారు. ముఖ్యంగా ఢిల్లీ ఉదంతం ప్రభావం ఆయా రాష్ట్రాలపై ఎలా ఉందో అడిగి తెలుసుకోనున్నారు. లాక్‌డౌన్ పొడిగింపు తదితర అంశాలపై రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభిప్రాయాలను పరిగణలోకి మోడీ తీసుకునే అవకాశముంది.

కరోనా కట్టడికి రాష్ట్రాలు చేపట్టిన చర్యలు...ఫలితాలపై మోడీ మాట్లాడనున్నారని తెలుస్తోంది. ఆయా రాష్ట్రాల సీఎంలు ఇచ్చే సలహాలు కూడా మోడీ స్వీకరించనున్నారని తెలుస్తోంది. మార్చి 20న కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల సీఎంలతో మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. గురువారం జరగనున్న వీడియో కాన్ఫరెన్స్ లో మాత్రం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోడీ మాట్లాడబోతున్నారు. 

మరోవైపు, ఢిల్లీ నిజాముద్దీన్ ఉదంతంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాల సీఎస్‌లు, డీజీపీలతో కేంద్ర కేబినెట్ సెక్రటరీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఢిల్లీ కేసులకు సంబంధించి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీలో మర్కస్ లో జరిగిన సదస్సుకు హాజరైన వారిని గుర్తించి.. వారు ఎవరెవరిని కలిశారో తెలుసుకోవాలని ఆదేశించారు. వారిని వెంటనే గుర్తించకుంటే వైరస్ వేగంగా విస్తరించే అవకాశముందని సూచించింది. ఢిల్లీలో సద్సుకు హాజరైన విదేశీయులు కొందరు వీసా నిబంధనలను ఉల్లంఘించారని, వారిపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.