భారత్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్

July 08, 2020

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోడీ మరోసారి కాంగ్రెస్ విమర్శలకు టార్గెట్ అయ్యారు. భారత పర్యటనకు వచ్చిన సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ ను ప్రధాని దగ్గరుండి స్వాగతించడమే దీనికి కారణం. ప్రొటోకాల్ ను కూడా పక్కన పెట్టి మోడీ విమానాశ్రయానికి వెళ్లి మరీ సల్మాన్ ను సాదరంగా ఆహ్వానించారు. ఈ చర్యను తప్పుపడుతూ కాంగ్రెస్ తన విమర్శలకు పదును పెట్టింది. తమ శతృదేశం పాకిస్తాన్ ఆర్థికంగా బలం పుంజుకోవడానికి సహకరిస్తోన్న సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ ను స్వాగతించడానికి ప్రొటోకాల్ ను పక్కన పెట్టడం అవసరమా? అంటూ కాంగ్రెస్ విమర్శిస్తోంది. ఈ మేరకు ఆ పార్టీ సీనియర్ నేత రణ్ దీప్ సూర్జేవాలా ఘాటుగా విమర్శించారు.

జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లా అవంతిపురాలో చోటు చేసుకున్న ఉగ్రవాదుల దాడి చోటు చేసుకున్న మరుసటి రోజే మహమ్మద్ బిన్ సల్మాన్ పాకిస్తాన్ లో పర్యటించారని సూర్జేవాలా గుర్తు చేశారు. తన పాకిస్తాన్ పర్యటన సందర్భంగా సల్మాన్.. 20 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడులను పెట్టనున్నట్లు ప్రకటించారు. దీనివల్ల పాకిస్తాన్ ఆర్థిక స్థితిగతులు పూర్తిగా మారిపోతాయని అన్నారు. పాకిస్తాన్ ఆర్థికంగా బలోపేతం అవుతుందని, ఆ దేశం నుంచి మరిన్ని దాడులకు ఇదీ ఓ కారణమౌతుందని సూర్జేవాలా అభిప్రాయపడ్డారు.

సౌదీ అరేబియా పాకిస్తాన్ లో పెట్టుబడులు పెట్టడాన్ని, ఆ దేశ క్రౌన్ ప్రిన్స్ సల్మాన్ భారత పర్యటనను కూడా తాము తప్పుపట్టట్లేదని సూర్జేవాలా అన్నారు. ఆయనను స్వాగతించడానికి ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి ప్రొటోకాల్ ను ఉల్లంఘించడం సరికాదని చెప్పారు. ఈ రకంగా ప్రధాని.. పుల్వామా అమర వీరులకు నివాళి అర్పిస్తున్నారా? అని నిలదీశారు గతంలోనూ ప్రధాని ప్రొటోకాల్ ను పాటించకుండా, ఎకాఎకిన పాకిస్తాన్ కు వెళ్లి, అప్పటి ప్రధాని నవాజ్ షరీఫ్ ను ఆలింగనం చేసుకుని మరీ వచ్చారని ఎద్దేవా చేశారు. మోడీ పడుతున్న తాపత్రయం అంతా ఎన్నికల స్టంట్ గా సూర్జేవాలా అభివర్ణించారు. మౌలానా మసూద్ అజర్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించడానికి సహకరించాలని మోడీ ఈ సందర్భంగా మహమ్మద్ బిన్ సల్మాన్ ను కోరగలరా? అని ప్రశ్నించారు.

కాగా, మనదేశ మౌలిక రంగంలో సౌదీ అరేబియా భారీగా పెట్టుబడులను పెట్టే విషయాన్ని సల్మాన్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జాతీయ రహదారులు, నౌకాశ్రయాల నిర్మాణంలో సౌదీ అరేబియా పెట్టుబడులు పెడుతుందని కేంద్రం ఆశిస్తోంది. ఈ పెట్టుబడుల విలువ ఎంత ఉండొచ్చనేది ఇంకా తెలియరావాల్సి ఉంది.