బాబుకు మోడీ కాల్ ...ఏం మాట్లాడారు?

June 04, 2020

నోట్ల రద్దు సమయంలో, జీఎస్టీ సమయంలో దేశంలో అనుభవజ్జులు, ప్రతిపక్షాలను సంప్రదించకుండా తన కోర్ టీమ్ తో పనికానిచ్చేసిన మోడీ దాని దుష్ఫలితాలకు విమర్శలు పడాల్సి వచ్చింది. అందుకే ఆయన మహమ్మారి కరోనా విషయంలో ఆ తప్పుచేయలేదు. ప్రపంచాన్ని గమనించారు. అందరి పరిశోధనలు, పరిశీలనలు, చేపడుతున్న చర్యలు గమనించారు. దేశంలో నిపుణులతో మాట్లాడారు. మీడియా పెద్దలతో, ప్రతిపక్షాలతో మాట్లాడారు. ప్రజలను చైతన్య పరచడానికి సెలబ్రిటీలు, క్రీడా ప్రముఖులతో మాట్లాడారు. అందరి అభిప్రాయాలతో పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. 

ఈరోజు చంద్రబాబు మీడియాతో మాట్లాడుతున్న సందర్శంలో ఉదయం మోడీ తనకు కాల్ చేసిన విషయం వెల్లడించారు. ఇప్పటికే  ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రాల్లోనూ ముఖ్యమంత్రులతో పలుమార్లు మాట్లాడుతున్నారు. ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ నుంచి సోనియా గాంధీ సహా కొందరు ముఖ్యులను సలహాల కోసం సంప్రదించారు. తాజాగా చంద్రబాబుకు కాల్ చేశారు. దీని గురించి వెల్లడించిన చంద్రబాబు తాను కరోనా నియంత్రణ దిశగా మోడీకి కొన్ని సలహాలు, పరిశీలనలు వివరించినట్టు తెలిపారు. 

తెలుగుదేశం తరఫున కరోనా నియంత్రణ కోసం చేసిన పరిశీలనతో పాటు, పార్టీ తరఫున చేపడుతున్న చర్యల గురించి వివరించినట్లు కూడా చెప్పారు. ఈ సందర్భంగా బాబు ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. కరోనా కట్టడి దిశగా ఓ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి  దాని ఆధ్వర్యంలో కొన్ని బృందాలను ఏర్పాటుచేసి అధ్యయనాలపై చేపట్టినట్లు తెలిపారు. ప్రధానికి ఇంతకుముందే రాసిన లేఖలో వాటిని ప్రస్తావించారట. నివారణ చర్యలతో పాటు  దీని గురించి తాజా ఫోన్ కాల్‌లోనూ నిశితంగా చర్చించినట్లు బాబు వెల్లడించారు.