అమరావతికి గుడ్ న్యూస్ ? కేంద్రం ఎంట్రీకి ముహూర్తం

August 10, 2020

కొన్ని సందర్భాల్లో చోటు చేసుకునే పరిణామాలు చాలా ఆసక్తికరంగా కనిపిస్తాయి. అన్ని బహిరంగంగా జరుగుతూనే ఉన్నా.. అప్పటివరకూ పట్టించుకోనట్లుగా వ్యవహరించి.. అంతలోనే ఆరా తీయటం వెనుక కారణం ఏమిటన్నది ఒక ప్రశ్న అయితే.. తాజాగా ఏపీ రాజధాని మార్పు.. సీఆర్ డీఏ చట్టం రద్దు చేయటానికి ఏపీ రాష్ట్ర పంపిన బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్న విషయం తెలిసిందే. జగన్ సర్కారు కొలువు తీరిన తర్వాత అమరావతిపై కీలక నిర్ణయం తీసుకోవటం.. పాలనను.. డెవలప్ మెంట్ ను వికేంద్రీకరించటం తెలిసిందే.

ఈ మధ్యనే రాజధాని మార్పు.. సీఆర్ డీఏ చట్టం రద్దుపై అసెంబ్లీ బిల్లుల్ని ఆమోదించి గవర్నర్ వద్దకు పంపింది. ప్రస్తుతం ఇవి రాజ్ భవన్ లో పెండింగ్ లో ఉన్నాయి. ఇలాంటి వేళ.. ప్రధానమంత్రి కార్యాలయం ఈ బిల్లుల మీద ఆరా తీయటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీనికి కారణం హిందూ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి జీవీఆర్ శాస్త్రి.

తాజాగా ఆయన రెండు బిల్లులకు సంబంధించిన ఒక లేఖను ప్రధానమంత్రి కార్యాలయానికి రాశారు. ఆయన వాదన ప్రకారం రాజధాని ఏర్పాటు కేంద్రం పరిధిలోని అంశమని.. హైకోర్టు నోటిఫికేషన్ రాష్ట్రపతి ఆమోదంతో జరగిందని చెబుతున్నారు. రాజధాని మార్చటంలో కలిగే నష్టాల్ని ఆయన ప్రధాని.. రాష్ట్రమంత్రి.. కేంద్ర హోంమంత్రికి లేఖలు రాశారు. వీరి ముగ్గురిలో ప్రధానమంత్రి కార్యాలయం తాజాగా స్పందించటం ఆసక్తికరంగా మారింది.

ఎందుకంటే జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న దగ్గర నుంచి గవర్నర్ వద్దకు చేరే వరకూ ఏ విషయంలోనూ దాపరికం లేదు. ఒకవేళ రూల్ బుక్ కు విరుద్ధంగా బిల్లులు తయారై ఉంటే.. ఆ విషయాన్ని తన వేగుల ద్వారా కేంద్రం ఇప్పటికే తెలుసుకొని ఉంటుంది కదా? అప్పుడు నిలువరించొచ్చు కదా? బిల్లు గవర్నర్ వద్దకు వచ్చే వరకూ.. ఎవరో దాని మీద ఫిర్యాదు చేసే వరకు ఆరా తీయకుండా ఉండటం ఏమిటి? లాంటి ప్రశ్నలు చాలానే వస్తున్నాయి.

తాను రాసిన లేఖకు స్పందనగా పీఎంవో ఆరా తీసిన నేపథ్యంలో శాస్త్రి మాట్లాడుతూ.. రాజధాని మార్చటం ఎలా సాధ్యం కాదన్న విషయాన్ని పీఎంవో కార్యాలయానికి వివరించానని.. దీనిపై ఆటార్నీ జనరల్ న్యాయ సలహా కూడా తీసుకోవాలని కేంద్రాన్ని కోరినట్లు చెబుతున్నారు. ఇన్నాళ్లు చూడనట్లుగా ఉన్న కేంద్రం ఇప్పుడు మాత్రం ఆకస్మాత్తుగా ఆరా తీయటం మాత్రం ఆసక్తికరంగా చెప్పక తప్పదు.