గచ్చిబౌలి హాస్టల్ లో ఐటీ ఉద్యోగిని సూసైడ్ అందుకేనా?

July 12, 2020

హైదరాబాద్ మహానగరంలోని ఒక లేడీస్ హాస్టల్ లో ఐటీ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకున్న ఉదంతం ఉలిక్కిపడేలా చేసింది. 24 ఏళ్ల పొగాకు హరిణి అనే అమ్మాయి గచ్చిబౌలిలోని లేడీస్ హాస్టల్ లో ఉంటోంది. మాదాపూర్ లోని గోల్డెన్ హిల్స్ క్యాపిటల్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలో జూనియర్ సాఫ్ట్ వేర్ డెవలపర్ గా పని చేస్తోంది.
ఈ రోజు (బుధవారం) ఆమె ఆఫీసుకు వెళ్లలేదు. హాస్టల్ లోని తన రూంలోని గదిలో చున్నీతో ఆత్మహత్యకు పాల్పడింది. రెండున్నరేళ్లుగా కంపెనీలో పని చేస్తున్న ఆమె ఉద్యోగ ఒప్పందం ఈ డిసెంబరుతో పూర్తి కానుంది. జాబ్ పోతుందన్న భయంతోనే ఆమె ఆత్మహత్య చేసుకుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మృతురాలి స్వస్థలం మహబూబ్‌నగర్‌ అని భావిస్తున్నారు. ఆమె ఆత్మహత్య వెనుక కారణాలు ఏమిటన్న విషయం మీద లోతుగా విచారణ జరుపుతామని రాయదుర్గం పోలీసులు చెబుతున్నారు. సూసైడ్ నోట్ లాంటివేమీ లభించలేదని సమాచారం. ఆఫీసులోని ఆమె కోలీగ్స్ ను పోలీసులు విచారిస్తే మరింత సమాచారం లభించే అవకాశం ఉందంటున్నారు.