రాజన్న రాజ్యమని... రెడ్డి రాజ్యాన్ని నిర్మిస్తున్నారే

February 27, 2020

గడచిన ఎన్నికలకు ముందు సుదీర్ఘ పాదయాత్ర చేపట్టిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... ఎన్నికల్లో తమ పార్టీని గెలిపించాలని, తాను అధికారంలోకి వస్తే రాష్ట్రంలో రాజన్న పాలన తెస్తానని చెప్పిన మాటలు జనం చెబుల్లో ఇప్పటికీ రింగురింగుమని వినిపిస్తున్నాయి. సరే... ఒక్క సారి అవకాశం ఇవ్వని జగన్ జనం కాళ్లావేళ్లా పడితే... ఏదోలే ఓ సారి చూద్దామంటూ జనం కూడా జగన్ కు అధికారం ఇచ్చేశారు. విపక్షంలో ఉన్నప్పుడు తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన సంక్షేమ పాలనకు జగన్ కొత్తగా రాజన్న రాజ్యం అని పేరు పెట్టుకుని, దానినే రాష్ట్రంలో అమలు చేస్తానంటూ ఏపీకి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగానూ గొప్పగానే చెప్పుకున్నారు. అయితే ఆ సందర్భంగానే ఆయన చేపట్టిన తొలి నియామకం చూస్తేనే... జగన్ రాకతో రాష్ట్రంలో రాజన్న రాజ్యం వస్తుందా? లేదంటే రెడ్డి రాజ్యం వస్తుందా? అన్న అనుమానాలు కూడా కలిగాయి.

ఎన్నికల ప్రచారంలో అంతకుముందు జనానికి మాటిచ్చిన రాజన్న రాజ్యాన్ని... అధికారంలోకి వచ్చినంతనే మరిచిపోయిన జగన్... తన మదిలో అంతర్లీనంగా దాగి ఉన్న రెడ్డి రాజ్యాన్ని బయటకు తీశారు. ఏపీ సీఎంగా తనకు కార్యదర్శిగా ఐఏఎస్ అధికారిగా ఉన్న ధనుంజయరెడ్డిని నియమించుకున్న జగన్... ఆ తర్వాత కూడా తాను చేపట్టిన దాదాపుగా అన్ని నియాకాల్లోనూ రెడ్డి సామాజిక వర్గానికే ప్రాధాన్యం ఇస్తూ పోతున్నారు. మొత్తంగా రాజన్న రాజ్యానికి బదులుగా జగన్... రాష్ట్రంలో రెడ్డి రాజ్యాన్ని స్థాపిస్తున్నారని దాదాపుగా తేలిపోయింది. జగన్ అనుసరిస్తున్న ఈ తరహా వైఖరిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నా కూడా ఆయన ఎంతమాత్రం పట్టించుకునేలా లేరని కూడా తదనంతర పరిణామాలను చూస్తున్న వారు ఇట్టే తేల్చేశారు.

జగన్ చేపట్టిన నియామకాలను చూసే ఎవరికైనా ఇదే భావన కలగక మానదు. జగన్ ఇప్పటిదాకా చేపట్టిన నియామకాలను మనమూ ఓ లుక్కేద్దాం పదండి. తన కార్యదర్శిగా ధనుంజయరెడ్డిని నియమించుకున్న జగన్.. ఆ వెంటనే ఆంధ్రా వర్సిటీ వీసీగా రెడ్డి సామాజిక వర్గానికే చెందిన ప్రసాదరెడ్డిని నియమించేశారు. ఆ తర్వాత తన బాబాయి వైవీ సుబ్బారెడ్డిని తిరుమల తిరుపతి దేవస్ధానం పాలకమండలి చైర్మన్ గా నియమించుకున్నారు. ఆ తర్వాత ఏపీ లోకాయుక్తగా తన సామాజిక వర్గానికే చెందిన జస్టిస్ లక్ష్మణ రెడ్డిని నియమించుకున్నారు. ఇక సీఎంలో తన సలహాదారుగా కూడా తన సామాజిక వర్గానికి చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అజేయ  (రెడ్డి) కల్లంను నియమించుకున్నారు. సరే... అధికారులంటే తన వెంట ఉండి పనిచేసే వారు అనుకుంటే... ఇప్పుడు ఏపీకి జీవనాడిగా పరిగణిస్తున్న పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టును కూడా జగన్ తన సామాజిక వర్గానికే కేటాయించేసుకున్నారు. 

జగన్ సీఎం అయ్యేదాకా పోలవరం పనులను నవయుగ కంపెనీ నిర్వహించిన విషయం తెలిసిందే. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకు చెందిన ఈ కంపెనీని ఎలాగైనా బయటకు పంపేయాలన్న వ్యూహంతో కదిలిన జగన్... రివర్స్ టెండర్లు చేపడుతున్నామన్న సాకును చూపిన జగన్... నవయుగకు సమాధానం చెప్పుకునే అవకాశం ఇవ్వకుండా దాదాపుగా గెంటేసినంత పనిచేశారు. సరే... నవయుగ పోతే... ఇంకెవరైనా దాని కంటే పెద్ద కంపెనీ వస్తుందేమోనని భావించినా... రెడ్డి వర్గానికి చెందిన కంపెనీకే ఇప్పుడు పోలవరం పనులను అప్పగించేశారు. ఏపీకే చెందిన కృష్ణారెడ్డి కంపెనీగా మేఘా అందరికీ చిరపరచితమే. ఇప్పుడు రివర్స్ టెండర్లను ఓపెన్ చేసిన జగన్ సర్కారు... కృష్ణారెడ్డికి చెందిన మేఘాకే పోలవరం పనులను కట్టబెట్టేసింది. నిర్దేశిత వ్యయం కన్నా తక్కువ (లెస్)కే బిడ్ ను దాఖలు చేసిందన్న కారణంతో మేఘాకు ఈ టెండర్ ను ఖరారు చేశారు. 

జగన్ చెప్పినట్లుగా పోలవరంలో నష్టానికే పనిచేసే కృష్ణారెడ్డికి ఆర్టీసీ కొత్తగా కొనుగోలు చేయనున్న ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలులో భారీ ఎత్తున లబ్ధి చేకూర్చేందుకు ఇప్పటికే జగన్ రంగం సిద్ధం చేసిన వైనం మనకు తెలిసిందే. ఇక్కడ ఇంకె అంశాన్ని కూడా ప్రస్తావించుకోవాలి. రివర్స్ టెండర్లలో ప్రతి టెండర్ కు కనీసం రెండు బిడ్లు అయినా రావాలన్న నిబంధనను పెట్టిన జగన్ సర్కారు... పోలవరం టెండర్లకు కేవలం మేఘా ఒక్కటే బిడ్ వేసినా కూడా... తాను పెట్టుకున్న నిబంధనను తోసిరాజని మేఘాకు ఆ పనులను కట్టబెట్టారు. గతంలో ఏ ఒక్కరూ చేయనంత స్థాయిలో కాస్తంత గట్టిగానే రెడ్డి రాజ్యాన్ని స్థాపిస్తున్నారని చెప్పక తప్పదన్న మాట.