చంద్రబాబు అవినీతి చేయలేదు - పీఎంవోకు చెప్పిన జగన్ 

August 14, 2020

ఊరుకోండి సార్... కలలో కూడా ఆ మాట అనడు జగన్ అని మీరు అనొచ్చు

తాటికాయంత అక్షరాలతో జగన్ పత్రికలో చంద్రబాబుకు పోలవరం ఏటీఎంలా మారింది అని రాశారే అని మీరు అనొచ్చు...

ఎన్ని చెప్పినా, ఎన్నిరాసినా... ఈ లేటెస్ట్ అఫిషియల్ అప్ డేట్ పచ్చి నిజం.

స్వయంగా తన గవర్నమెంటు పోలవరంలో బాబు అవినీతికి పాల్పడ్డారు అని ఇచ్చిన నివేదికను...అదంతా తూచ్ అని స్వయంగా ముఖ్యమంత్రి జగన్ కేంద్రానికి లేఖ రాశారు. జగన్ మోహన్ రెడ్డి చచ్చినా అలాంటి లేఖ రాయడు అని మీరు కొట్టిపారేయొచ్చు. మరి లేక రాయకపోతే లెక్క రాదు అని తేలాక రాయకుండా ఎక్కడపోతాడండీ?

చివరాఖరికి జగన్ సార్ వారు తేల్చింది ఏంటయ్యా అంటే... పోలవరంలో అవినీతి జరిగిందని నేను వేసిన కమిటీ ఇచ్చిన నివేదికను తప్పు తెలుసుకుని నేనే పక్కన పెడుతున్నాను. మీరు కూడా పక్కన పెట్టి ఆ పోలవరం నిధులు కాస్తా విడుదల చేయండీ సామీ అని ఏపీ సర్కారు  నుంచి పీఎంవోకు, అక్కడి నుంచి కేంద్ర జల శక్తి శాఖకు లేఖ వెళ్లింది. 

ఇదంతా బయటకు ఎలా వచ్చిందయ్యా అంటే... జనసేన నేత చేసిన ఒక పని వల్ల బయటపడింది.

జనసేన నేత ,రాజకీయ విశ్లేషకుడు పెంటపాటి పుల్లారావు పోలవరం అవినీతిపై వివరాలు బయట పెట్టాలని ఒక వినతిపత్రం రాస్తూ వివరాలు కోరారు. దీనిపై స్పందించిన కేంద్ర జలశక్తి శాఖ పెంటపాటి పుల్లారావుకు సమాధానం పంపింది. అందులో చంద్రబాబు హయాంలో అవినీతి జరిగినట్లు ఆధారాల్లేవని పేర్కొంది. అలాగే పోలవరంలో అవినీతి జరిగిందని.. విచారణ జరపాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ తమను ఆదేశించలేదని జలశక్తి శాఖ స్పష్టం చేసింది. 

అంతకు మునుపు ఏం జరిగింది? 

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాజీ అధికారి రేమండ్ పీటర్ ( జగన్ బంధువు) నేతృత్వంలో ఓ కమిటీ వేశారు. ఆ కమిటీ పరిశీలన జరిపి.. అవినీతి జరిగిందని నివేదిక ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఆ నివేదికను తీసుకెళ్లి జలశక్తి శాఖకు పంపారు. స్వయంగా ప్రధానమంత్రి కార్యాలయంలోనూ ఇచ్చారు.

తదనంతరం ఆ నివేదికలో గుర్తించిన అవినీతిపై ఆధారాలు కావాలని జలశక్తి శాఖ ద్వారా ప్రధానమంత్రి కార్యాలయం ఏపీ ప్రభుత్వాన్ని కోరింది. 

రెండు, మూడుసార్లు లేఖలు రాసినా జగన్ సర్కారు స్పందించలేదు. ఈ క్రమంలో పోలవరానికి విడుదల చేయాల్సిన పెండింగ్ నిధులు ఏపీ సర్కార్ నియమించిన కమిటీ గుర్తించినట్లుగా చెప్పిన అవకతవకల వ్యవహారం తేలిన తర్వాతే విడుదల చేస్తామని స్పష్టం చేసింది. దీంతో జగన్ సర్కారు మైండ్ బ్లాక్ అయ్యింది.

దీంతో జగన్ సర్కారు ఆ నివేదికను తాము పక్కన పెడుతున్నామని, మీరు కూడా పరిగణనలోకి తీసుకోవద్దని జలశక్తి శాఖకు సూచించిది. ఇదే విషయాన్ని పెంటపాటి పుల్లారావుకు జలశక్తి శాఖ తెలిపింది.  నిబంధనలకు అనుగుణంగానే అవినీతికి తావు లేకుండా పోలవరం నిర్మాణం జరుగుతోందని రాష్ట్ర ప్రభుత్వం తమకు చెప్పినట్లుగా కేంద్ర జలశక్తి శాఖ స్పష్టం చేసింది.

కొసమెరుపు - రేమండ్ పీటర్ కమిటీ అమరావతిపై కూడా ఇలాంటి ఓ నివేదిక తయారు చేసింది. అందులో 30 వేల కోట్లు గోల్ మాల్ జరిగినట్లుగా నివేదిక ఇచ్చింది. ఇందులో లీకులు బయటకొచ్చాయి. బాబు ప్రభుత్వంలో పది వేల కోట్ల పనులు జరిగితే 30వేల కోట్ల గోల్ మాల్ ఎలా జరిగిందనే విమర్శలు రావడంతో.. ఏపీ సర్కార్ ఆ రిపోర్ట్‌ను బయట పెట్టలేదు. అదన్నమాట విషయం. ఇపుడు నిజాలు దేవుడికే కాదు... అందరికీ అర్థం అవుతున్నాయి. కాలమహిమ మరి.