టీడీపీ నేతలపై పోలీసుల రివెంజ్ కేసులు

May 27, 2020

తెలంగాణలో పద్నాలుగేళ్లు ఉద్యమాలు జరిగాయి. ఏనాడైనా నాయకులను నాన్ బెయిలబుల్ కేసుల్లో జైలుకు పంపారా? చాలా పెద్ద సంఘటనల్లో ఒకట్రెండు సార్లు మాత్రమే జరిగింది. ఎందుకంటే నిరసన ప్రజల హక్కు. దానిని పోలీసులు హింసకు దారితీస్తే తప్ప అడ్డుకోకూడదు. కానీ ఏపీలో ప్రభుత్వం నిరసన తెలపడానికే ఒప్పుకోవడం లేదు. తెలుగుదేశం పార్టీ నేత గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ రాజధాని రైతుల తరఫున, ఏపీ ప్రజల తరఫున ఉద్యమంలో పాల్గొని చలో అసెంబ్లీలో పాల్గొంటే... పోలీసులు అరెస్టు చేశారు. కొట్టారు. చొక్కాలు చింపారు. రాత్రికి రాత్రి కోర్టులో ప్రవేశపెట్టి జైలుకు పంపారు. మరుసటి రోజు గల్లా జయదేవ్ కు బెయిలు వచ్చింది. అయితే... పగబట్టి మరీ పోలీసులు మరోకేసు పెట్టారు.

ఆందోళనలు జరిగినపుడు పోలీసులకు చిన్నచిన్న గాయాలు కావడం సర్వసాధారణం. ఆ విధులే అలాంటివి. కానీ తాజాగా ఒక హెడ్ కానిస్టేబుల్ ఒక ఎంపీ మీద పెట్టిన కేసు తీరు చూస్తే అనేక అనుమానాలు కలగక మానవు. గుంటూరు జిల్లా దుర్గి మండలం ముటుకూరు హెడ్ కానిస్టేబుల్ పెరంబదూరి వేణుగోపాలస్వామి ఈ కేసు పెట్టారు. ఆయన ఏమని ఫిర్యాదు చేశారో చూడండి.‘‘గల్లా జయదేవ్ బందోబస్తు విధుల్లో ఉన్న తమపై దౌర్జన్యానికి ప్రేరేపించారు. తమను నెట్టుకుంటూ అసెంబ్లీ వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు’’. 

మరో ఫిర్యాదు ఇలా ఉంది...‘‘ఆందోళనకారులు గుంపుగా వచ్చి సచివాలయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన వేళ, వారిని వెనక్కు పంపేందుకు తాము ప్రయత్నిస్తున్నాం. వీళ్లను రాళ్లతో కొట్టాలంటూ, కొందరు రాళ్లు విసిరారని, వాటిల్లో ఒకటి తన కుడి కంటి పైభాగంలో తగిలిందని ఏఆర్ కానిస్టేబుల్ గజ్జల హరీశ్ ఫిర్యాదు చేశారు. గాది లింగం అనే మరో కానిస్టేబుల్ కు నుదుటిపైనా, రాజమండ్రికి చెందిన నాగరాజు, వీరప్పనాయక్ అనే పోలీసులకు ఇతర చోట్ల గాయాలు అయ్యాయని, ఇక్కడి తీవ్రతను గమనించిన ఫోర్స్, తమను రక్షించిందని తన ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదులు చేసిన తీరు, కేసులు రాసిన తీరు చూస్తే... వారి సాహసం వెనుక ఎవరున్నదీ అర్థమవుతుంది. ఒక వైపు పోలీసులు లాఠీఛార్జీలు చేస్తున్నా వాటిని భరించి రైతులు తమ హక్కుల కోసం పోరాడుతుంటే... మరోవైపు 5 కోట్ల మంది నమ్మకాన్ని చంద్రబాబు వమ్ముచేశాడంటూ జగన్ అసెంబ్లీలో సెలవిచ్చారు. గుంటూరు కృష్ణా రెండు జిల్లాలోనే దాదాపు 50 లక్షల మంది జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ర్యాలీలు తీస్తుంటే... 5 కోట్ల మంది నమ్మకాన్ని వమ్ముచేశారని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి జగన్ చెప్పడం పచ్చి అబద్ధమే కదా.