శివాజీ విషయంలో పోలీసులు బుక్కయ్యారా?

July 07, 2020

టీవీ 9 వివాదంలో ఆ ఛానెల్ మాజీ సీఈఓ రవిప్రకాశ్ తో పాటు పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ నటుడు శివాజీని బుధవారం ఉదయం తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎక్కడికో వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన శివాజీని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. చూడ్డానికి ఇది చిన్న విషయంగానే కనిపిస్తున్నా... అసలు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో శివాజీని అదుపులోకి తీసుకునేందుకు తెలంగాణ పోలీసులకు అధికారం ఉందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చట్ట ప్రకారమే చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు శివాజీని అందుకు విరుద్ధంగా ఎలా అదుపులోకి తీసుకుంటారన్న కొత్త వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

ఇప్పటికే టీవీ 9 కొత్త యాజమాన్యం అలంద మీడియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు రవిప్రకాశ్ తో పాటు శివాజీపైనా కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసుల విచారణకు సహకరించాల్సిందిగా రవిప్రకాశ్ తో పాటు శివాజీకి కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులు వీరిద్దరూ పెద్దగా పట్టించుకోలేదు. అంతేకాకుండా ఈ వివాదంలో తమ తప్పేమీ లేదని, అలంద మీడియా చేస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమైనవేనని వారిద్దరూ కోర్టు గడప తొక్కారు. ఈ క్రమంలోనే తమ నోటీసులకు స్పందించకుండా కొంతకాలం పాటు కోర్టుల చుట్టూ తిరిగిన రవిప్రకాశ్ తనకు తానుగా తమ ముందుకు వస్తేనే తెలంగాణ పోలీసులు ఆయనను విచారించారు. అంతేగానీ అదుపులోకి తీసుకోవడం గానీ, అరెస్ట్ చేయడం గానీ చేయలేకపోయారు.

అదే సమయంలో రవిప్రకాశ్ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయడంతో దానిపై విచారణ చేపట్టిన కోర్టు తన తీర్పును వాయిదా వేసింది. ఈ క్రమంలో రవిప్రకాశ్ పోలీసుల విచారణను ముగించుకుని ఎంచక్కా ఇంటి పట్టునే ఉన్నారు. ఇక శివాజీ విషయానికి వస్తే... అసలు ఈ కేసులో తన పాత్ర ఏమీ లేదని, తనపై అలంద మీడియా చేసినవన్నీ తప్పుడు ఆరోపణలేనని, వాటిని కొట్టివేయాలని శివాజీ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దానితో పాటు తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కూడా శివాజీ కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఇటు శివాజీ వాదనతో పాటు తెలంగాణ పోలీసుల వాదనను కూడా కోర్టు ఆలకించింది. అనంతరం దీనిపై ఎలాంటి తీర్పును వెలువరించని కోర్టు తదుపరి విచారణను వాయిదా వేసింది.

ఈ పిటిషన్ పై కోర్టు తన తుది నిర్ణయాన్ని ప్రకటించకుండానే పోలీసులు శివాజీని అదుపులోకి తీసుకోవడం కుదరదు. మరి తెలంగాణ పోలీసులు బుధవారం ఉదయం... ఏకంగా ఎయిర్ పోర్టులో శివాజీని అదుపులోకి తీసుకోవడాన్ని చూస్తుంటే... నిబంధనలకు విరుద్ధంగానే ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్న వాదన వినిపిస్తోంది. అంతేకాకుండా శివాజీని అదుపులోకి తీసుకునే సమయంలో హడావిడి చేసినా... ఆ తర్వాత నిబంధనలు, కోర్టు పరిధిలో పిటిషన్ విచారణ గుర్తుకు వచ్చిన పోలీసులు శివాజీని వదిలిపెట్టేశారు. మొత్తంగా చూస్తుంటే... శివాజీని అదుపులోకి తీసుకునే విషయంలో పోలీసులు నిబంధనలను పాటించలేదన్న మాట కాస్తంత గట్టిగానే వినిపిస్తోంది.