కాజల్ కి ఎంత కష్టమొచ్చింది...

August 03, 2020

సుదీర్ఘకాలంగా సినిమా ఇండస్ట్రీలో ఉండి కూడా ఎలాంటి వివాదాలకు.. ఎఫైర్ వార్తలకు అవకాశం ఇవ్వకుండా టాప్ హీరోయిన్ గా నిలవటం అంత తేలికైన విషయం కాదు. ఎవరికి ఎక్కడ.. ఎంతమేరకు ఉంచాలన్న విషయంలో పూర్తిస్థాయి అవగాహనతో పాటు.. ఒత్తిళ్లు.. ఇతరత్రాలను తెలివిగా డీల్ చేసే సామర్థ్యం చాలా అవసరం. అలాంటి వాటి విషయంలో టన్నుల కొద్దీ తెలివి కాజల్ అగర్వాల్ సొంతంగా చెబుతారు. అప్పుడెప్పుడో నార్త్.. సౌత్ అన్న విషయంలో తప్పించి ఈ రీల్ చందమామ చిక్కుల్లో పడలేదు. అప్పటికి నార్త్ కు వెళ్లగానే పుట్టింటికి వెళ్లినట్లుగా అనిపిస్తుందన్న ముద్ర నుంచి బయటపడేందుకు కొంచెం టైమే తీసుకున్నా.. ఆ తర్వాత మళ్లీ వెనుదిరిగి చూసుకున్నది లేదు.
అలాంటి ఈ అందాల భామకు తాజాగా తమిళనాడు పోలీసుల నుంచి సమన్లు అందాయి. ఆమె తాజాగా నటిస్తున్న ఇండియన్ 2 చిత్ర షూటింగ్ లో ఇటీవల చోటు చేసుకున్న ప్రమాదంగా చెబుతున్నారు. లైకా సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ లో భారీ ప్రమాదం చోటు చేసుకోవటం.. ముగ్గురు యూనిట్ సభ్యులు మరణించటం తెలిసిందే. ఈ వ్యవహారానికి సంబంధించి అక్కడున్న ప్రత్యక్ష సాక్ష్యులతో పాటు.. పలువురిని ప్రశ్నిస్తున్నారు.
ఇప్పటికే చిత్ర దర్శకుడు శంకర్ తో పాటు.. హీరో కమల్ హాసన్ కు సమన్లు జారీ చేశారు. అనంతరం వారిద్దరూ వేర్వేరుగా విచారణ అధికారుల ఎదుట హాజరై విచారణను ఎదుర్కొన్నారు. తాజాగా.. చిత్ర కథానాయకి కాజల్ అగర్వాల్ ను విచారించనున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే సమన్లు జారీ చేసినట్లుగా చెబుతుంటే.. మరికొందరు మాత్రం.. సమన్లను సిద్ధం చేశారని.. జారీ చేయటమే ఆలస్యమని చెబుతున్నారు. మొత్తానికి పోలీసుల విచారణకు కాజల్ హాజరు  కాక తప్పదన్న మాట బలంగా వినిపిస్తోంది.