రెండు లారీల బంగారం పట్టుకున్నారు... ఎవరిదో తెలుసా?

May 24, 2020

ఎన్నిక‌ల వేళ త‌మిళ‌నాట ప‌ట్టుబ‌డ్డ 1,381 కిలోల బంగారం పెను క‌ల‌క‌ల‌మే రేపుతోంది. ఎప్పుడు ఎన్నిక‌లు జ‌రిగినా... త‌మిళ‌నాడులో పెద్ద ఎత్తున న‌గ‌దు, బంగారం ప‌ట్టుబ‌డుతున్న విష‌యం తెలిసిందే. ఇందులో భాగంగానే ఇప్పుడు బుధ‌వారం నాడు చెన్నై సమీపంలోని తిరువల్తూరు జిల్లా వేపంబట్టు టోల్‌ప్లాజా వద్ద రెండు వాహ‌నాల్లో తరలిస్తున్న 1,381 కిలోల‌ బంగారాన్ని ఫ్తెయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇంత పెద్ద మొత్తంలో బంగారం... అది కూడా ఎన్నిక‌ల వేళ ప‌ట్టుబ‌డ‌టం నిజంగానే క‌ల‌క‌లం రేపుతోంది. అయితే ఇందులో మ‌రో ఆస‌క్తిక‌ర అంశం కూడా దాగి ఉంది. అదేంటంటే... ప‌ట్టుబ‌డ్డ బంగారం ఏ వ్య‌క్తికో, సంస్థ‌కో చెందిన‌ది కాదు. తిరుమ‌ల కొండ‌పై వెల‌సిన శ్రీ‌వేంక‌టేశ్వ‌ర స్వామికి చెందిన‌దట‌.

వెంక‌న్న‌కు భ‌క్తులు స‌మ‌ర్పించిన బంగారాన్ని టీటీడీ పాల‌క మండ‌లి వివిధ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తూ వ‌స్తున్న విష‌యం తెలిసిందే క‌దా. అలా పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంకులోనూ కొంత బంగారాన్ని టీటీడీ డిపాజిట్ చేసింది. ఈ బంగారాన్ని ఆ బ్యాంకు తిరుప‌తికి స‌మీపంలోని చెన్నైలోని త‌న బ్యాంకు శాఖ‌లో పెట్టేసిందట‌. డిపాజిట్ కాల ప‌రిమితి ముగియ‌డంతో మ‌రింత కాలం పాటు అదే బ్యాంకులో ఆ బంగారాన్ని డిపాజిట్ చేసేందుకు టీటీడీ స‌సేమిరా అన్న‌ద‌ట‌. త‌క్కువ వ‌డ్డీనే ఇందుకు కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలో త‌మ వ‌ద్ద డిపాజిట్ చేసిన బంగారాన్ని తీసుకెళ్లాల‌ని ఆ బ్యాంకు టీటీడీకి క‌బురు పెట్టింద‌ట‌. అయితే ఏపీలోనే కాకుండా దేశ‌వ్యాప్తంగా ఎన్నిక‌లు జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఎన్నిక‌ల కోలాహ‌లం ముగిసిన త‌ర్వాత తీసుకోవ‌చ్చులే అన్న దిశ‌గా ఆలోచించిన టీటీడీ... బ్యాంకు పంపిన నోటీసుల‌కు స్పందించ‌లేద‌ట‌.

తీరా గ‌డువు ముగియ‌డంతో టీటీడీపీ చెప్పాపెట్ట‌కుండానే రెండు వాహ‌నాల్లో బంగారాన్ని వేసుకుని బ్యాంకు అధికారులు తిరుప‌తి బ‌య‌లుదేరార‌ట‌. అయితే మార్గ‌మ‌ధ్యలోనే అధికారులు ఈ బంగారాన్ని ప‌ట్టుకున్నారు. అయితే ఇంత పెద్ద మొత్తంలో బంగారాన్ని త‌ర‌లిస్తున్న బ్యాంకు అధికారులు అందుకు సంబంధించిన ప‌త్రాల‌ను మాత్రం త‌మ వెంట తీసుకెళ్ల‌డం మ‌రిచిపోయార‌ట‌. ఈ క్ర‌మంలోనే బంగారాన్ని ప‌ట్టేసుకున్న అధికారులు... స‌రైన ప‌త్రాలు లేక‌పోవ‌డంతో స్వాధీనం చేసుకున్నార‌ట‌. మొత్తంగా బ్యాంకు అధికారుల నిర్ల‌క్ష్యం కార‌ణంగా ఎన్నిక‌ల‌తో ఏమాత్రం సంబంధం లేని వెంక‌న్నను కూడా వివాదంలోకి లాగేసిన‌ట్టైందన్న వాద‌న వినిపిస్తోంది.