ముఖ్యమంత్రి సీటు...ఎవరడిగారో తెలుసా?

May 31, 2020

ఎన్నికలు ముగిశాయి. ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యింది. విజేత ఎవరో తేలింది. స్పష్టమైన మోజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన అన్ని ఉన్నా.. రెండు పార్టీల మధ్య నెలకొన్న ముఖ్యమంత్రి కుర్చీ పోట్లాట మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు కాని పరిస్థితి నెలకొంది. ఎన్నికల ఫలితాల అనంతరం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కుర్చీ తమకే ఇవ్వాలని బీజేపీ.. శివసేనలు పట్టుబట్టటం.. విషయం ఒక కొలిక్కి రాని విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మహారాష్ట్రలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అకాల వర్షాలతో పంటలు దెబ్బ తిని లక్షలాది రైతులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోతున్నట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ఎన్నికల హామీల్లోనూ రైతుల చుట్టూనే పార్టీలు మాట్లాడాయి.
ఇలాంటివేళ.. రైతులు కష్టాల్లో ఉంటే.. సీఎం కుర్చీలో ఎవరు కూర్చోవాలో మెజార్టీ వచ్చిన పార్టీలు లెక్క తేల్చుకోకపోవటంతో ఒక రైతుకు ఒళ్లు మండింది. బీడ్ జిల్లాకు చెందిన శ్రీకాంత్ విష్ణు గడలే అనే రైతు గవర్నర్ భగత్ సింగ్ కోష్యార్ కు ఒక లేఖ రాశారు.
రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా పంటలు పెద్ద ఎత్తున దెబ్బ తిన్నాయని.. దీంతో రైతాంగం తీవ్ర నిరాశలో కూరుకుపోయినట్లు పేర్కొన్నారు. రైతులు ఇబ్బందుల్లో కూరుకుపోయిన నేపథ్యంలో.. వారి సమస్యలు తీర్చేందుకు తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. రెండు పార్టీలు ముఖ్యమంత్రి స్థానాన్ని ఎవరు తీసుకోవాలో తేల్చుకునే లోపు తనకు ముఖ్యమంత్రి స్థానాన్ని ఇస్తే.. తానురైతాంగ సమస్యల్ని పరిష్కరిస్తానంటూ లేఖ రాశారు. ఈ లేఖ వ్యవహారం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రజల ఇక్కట్లు పట్టించుకోకుండా తమ ప్రయోజనాలే ముఖ్యమన్నట్లు వ్యవహరిస్తున్న పార్టీలకు తాజా రైతు లేఖ చెంప పెట్టులాంటిదని చెప్పక తప్పదు.

Read Also

మోదీ తన ప్రగాఢ వాంఛను పక్కనపెట్టేశారా?
250 కిలోల యాపిల్ పండ్ల దండ‌తో...బెయిల్ పొందిన నేత‌కు స్వాగ‌తం
హంగ్ కు చెల్లుచీటీ... మొత్తం సెట్ చేసిన అమిత్ షా