ఏపీలో నేత‌ల‌ జంపింగ్‌ల బ్రేక్‌కు రీజ‌న్ ఇదే...!

August 12, 2020

రానున్న స్థానిక‌, మునిసిప‌ల్ ఎన్నిక‌ల త‌ర్వాతే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పార్టీల్లోకి జంపింగ్ జ‌పాంగ్‌లు ఉండ‌బోతున్నాయ‌ని తెలుస్తోంది. వైసీపీలోకి వెళ్లాల‌నుకుంటున్న కొంత‌మంది నేత‌లు త‌మ నిర్ణ‌యాన్ని వాయిదా వేసుకుంటున్నార‌ని స‌మాచారం. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల త‌ర్వాత‌గాని నిర్ణ‌యం తీసుకోలేమ‌ని త‌మ స‌న్నిహితుల వ‌ద్ద చెబుతున్నార‌ట‌. వైసీపీపై జ‌నంలో అభిప్రాయం మారుతుండ‌టం, వైసీపీని కేంద్రం దూరం పెడుతుండ‌టం...పైగా అన‌ర్హ‌త వేటు..కేసుల గోల సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి చుట్టూ తిరుగుతున్నాయి.
ఈ నేప‌థ్యంలో ఆ పార్టీలోకి వెళ్లి చేతులు కాల్చుకోవ‌డం క‌న్నా ఎన్నిక‌లు పూర్త‌య్యాకే వెళ్ల‌డం ద్వారా ఏ పార్టీ బ‌ల‌మెంతో తెలుసుకుని వ్య‌వ‌హ‌రించిన‌ట్ల‌వుతుంద‌ని, అదే తెలివైన నిర్ణ‌య‌మ‌ని కొంత‌మంది రాజ‌కీయ నాయ‌కులు భావిస్తున్నారు. రాష్ట్రంలో పార్టీని విస్త‌రించ‌డ‌మే ధ్యేయంగా భావిస్తున్న బీజేపీ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డిపై కేసుల‌ను ఎప్పుడు తెర‌పైకి తెచ్చేది తెలియ‌డం లేదు. ఏపీలో వైసీపీ జోరుకు అడ్డుక‌ట్ట వేసేందుకైనా ఇలాంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ‌కుండా ఉంటుదా..? అన్న కోణంలోనూ ఆలోచిస్తున్నారు.
ఇదిలా ఉండ‌గా పార్టీకి జ‌వ‌స‌త్వాలు తెచ్చేందుకు టీడీపీ అధినేత చంద్ర‌బాబు తీవ్రంగా శ్ర‌మిస్తున్నారు. ఇటీవ‌ల వ‌రుస‌గా జిల్లా ప‌ర్య‌ట‌న‌ల‌తో పార్టీ కాస్త కుదుట‌ప‌డింది. మ‌ళ్లీ శ్రేణుల్లో ఉత్సాహం క‌నిపిస్తోంది. రానున్న స్థానిక‌, మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో స‌త్తాచాటి  ఉనికిలోనే ఉన్నామ‌ని నిరూపించుకోవాల‌ని చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. ఒక వేళ చంద్ర‌బాబు వ్యూహం ఫ‌లించి టీడీపీకి అనుకూలంగా ప్ర‌జ‌లు ఓట్లేసి ఎక్కువ స్థానాలను కైవ‌సం చేసుకుంటే మాత్రం వైసీపీకి ఎదురుదెబ్బ త‌గులుతుంది.
ఇక అప్పుడు వైసీపీలోకి వెళ్లిన ఇబ్బందే అవుతుంద‌ని కొంత‌మంది పార్టీ మారాల‌నుకుంటున్న టీడీపీ ఎమ్మెల్యేలు, ద్వితీయ శ్రేణి నాయ‌క‌త్వం పున‌రాలోచ‌న‌లో ప‌డ్డ‌ట్లు స‌మాచారం. ఎందుకైనా మంచిది ఎన్నిక‌లు పూర్త‌య్యాకే వెళ్తే  ప్ర‌జ‌లు ఏ పార్టీ వైపు ఉన్నారో..తెలిసిపోతుంది.. జ‌నాభిప్రాయం ప్ర‌కారం.. రాజ‌కీయ భ‌విష్య‌త్‌ను నిర్ణ‌యించుకుంటే స‌రిపోతుంద‌ని మెజార్టీ నేత‌లు పార్టీ మారే విష‌యాన్ని వాయిదా వేసుకుంటున్నార‌ట‌.