ఎన్నికల ముందు గుబులు పుట్టిస్తున్న స‌ర్వేలు

October 17, 2019

సార్వ‌త్రిక ఎన్నిక‌ల కోసం ఏపీ సిద్దం అవుతుంది. రాష్ట్రానికి స్పెష‌ల్ స్టేట‌స్ విష‌యంలో పార్టీల‌న్నీ కేంద్రంలో ఉన్న ఎన్‌డిఎను వ్య‌తిరేకిస్తున్నాయి. లోపాకారి ఒప్పందాలు ఎలా ఉన్న ప్ర‌త్యేక స‌దుపాయాల విష‌యంలోనే అన్ని పార్టీలో పోరాటం చేస్తున్నాయి. అయితే ఎన్నిక‌ల‌కు మ‌రో రెండు నెల‌లు గడువు ఉండగానే కొన్ని సంస్థ‌లు నిర్వ‌హిస్తున్న స‌ర్వేలు నేత‌ల్లో గుబులు రేపుతున్నాయి. ఓట‌రు తీర్చు ఎప్పుడు ఎలా మారుతుందో అనేది ఎవ‌రూ ఊహించ‌లేనిది. తెలంగాణ ఎన్నిక‌ల్లో  అంద‌రూ ఊహాల‌ను తారుమారు చేస్తూ టీఆర్ ఎస్ ఎదురులేని పార్టీగా నిలిచింది. మెజారిటీ స‌ర్వేలు ఈ విష‌యంలో బోల్తా ప‌డ్డాయి. అయిన‌ప్ప‌టికి త‌మ ఎనాల‌సిస్ లో మాత్రం మార్పు రావ‌డం లేదు. తాజాగా పార్లమెంట్‌ ఎన్నికల్లో వైసీపీ ఎక్కువ సీట్లు సాధించనుందని ‘రిపబ్లిక్‌ టీవీ - సీ ఓటర్‌’ సంస్థలు నిర్వహించిన సర్వే వెల్లడించింది. టీడీపీ 6 ఎంపీ స్థానాలకే పరిమితమవుతుందని ఈ సర్వే తేల్చింది. ‘నేషనల్‌ అప్రూవల్‌ రేటింగ్స్‌’ పేరుతో జరిగిన ఈ సర్వే ఫలితాలను రిపబ్లిక్‌ టీవీ తాజాగా విడుదల చేసింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రాష్ట్రంలోని మొత్తం 25 లోక్‌సభ స్థానాలకుగానూ.. వైసీపీ 41.3 శాతం ఓట్లతో 19 ఎంపీ సీట్లు, టీడీపీ 33.1 శాతం ఓట్లతో 6 ఎంపీ సీట్లు గెలుచుకుంటాయని సర్వే అంచనా వేసింది. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లు ఏపీలో ఒక్క స్థానంలో కూడా గెలవలేవని పేర్కొంది. గత ఎన్నికల్లో  ఏపీలో టీడీపీకి 15 ఎంపీ సీట్లు రాగా, వైసీపీ 8 ఎంపీ సీట్లను సాధించింది. ఇప్పుడు సర్వే మాత్రం పూర్తి విరుద్ధంగా ఉంది. 

అయితే ఈ సర్వేపై విమర్శలు కూడా వెల్లువెతున్నాయి. బీజేపీ, వైసీపీలు సర్వేల పేరుతో ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. '2014 ఎన్నికల ముందు వైసీపీ గెలుస్తుంది అంటూ కొన్ని సర్వేలు విడుదల చేసారు. కానీ ఫలితాలు తారుమారు అయ్యాయి. ప్రజలు టీడీపీకే పట్టం కట్టారు. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది' అంటూ టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. నిజ‌మే రెండు నెల‌ల త‌రువాత జ‌రిగే ఎన్నిక‌ల్లో  ఇప్ప‌టి నుంచి జ్యోష్యం చెప్ప‌డ‌మేంటి అని విశ్లేష‌కులు అంటున్నారు