జగన్ ఎఫెక్ట్... ప్రశాంత్ కిషోర్ ని ఠక్కున లాగేసింది

May 25, 2020

ప‌రిచ‌యం అవ‌స‌రం లేనంతగా ఎన్నిక‌ల వ్యూహక‌ర్త ప్రశాంత్ కిశోర్ పాపుల‌ర్ అయ్యారు. 2014 ఎన్నిక‌ల్లో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ గెలుపు వెనుక ఉన్న కీల‌క శ‌క్తుల్లో ఈయ‌న ఒక‌రు. అయితే వివిధ కార‌ణాల వ‌ల్ల ఆయ‌న బీజేపీకి దూరమ‌య్యారు. అనంత‌రం బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మోడీ శతవిధాల ప్రయత్నించినా జేడీయూ నేత నితీశ్‌కుమార్‌ గెలుపొందడానికి దోహదం చేశారు. అలాంటి స‌త్తా గల ప్రశాంత్ కిశోర్ ఆంధ్ర‌ప్రదేశ్‌లో ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ విజ‌యానికి వ్యూహరచన చేశారు. ఇకపై పశ్చిమబెంగాల్ లో తృణమూల్ పార్టీకి ఆయన సేవలు  అందించనున్నారు

ప్రశాంత్ కిశోర్ 2014 సాధారణ ఎన్నికలకు ముందు బీజేపీ ఎన్నికల ప్రచారం చేశారు. మోడీని అధికారంలోకి తేవడంలో పీకే కృషి కీలకం. 2015లో జేడీయూ-ఆర్జేడీ కూటమి విజయం కోసం ఆయన వేసిన ప్రణాళికలు, వ్యూహాలు, ఎత్తుగడలు ఫలించాయి. నితీష్ కు సీఎం కుర్చీని కట్టబెట్టాయి. తర్వాత వైఎస్ఆర్ సీపీ రాజకీయ వ్యూహకర్తగా పని ప్రారంభించారు. వైఎస్ జగన్ కు దిశానిర్దేశం చేసి వైసీపీని విజయతీరాలకు చేర్చారు. ఈ నేపథ్యంలోనే పీకే తాను స్థాపించిన ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ ( ఐ ప్యాక్) బాధ్యతలను సమర్ధవంతమైన వ్యక్తుల చేతిలో పెట్టేశారు. దేశంలోని ప్రధాన సమస్యలు, రాష్ట్రాల వారీగా రాజకీయ అంశాలు, వ్యూహాలు, దేశ అభివృద్ధికి ప్రణాళికలు వంటి అంశాలపై ఐ ప్యాక్ వర్క్ చేస్తోంది. ఆ సంస్థ అందించనున్న కీలక సమాచారంతో ఇక పీకే రాజకీయ భవిష్యత్ మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్టు దూసుకుపోతుందని రాజకీయ శ్రేణులు అంచనా వేశాయి.

అది నిజం చేస్తూ, కోల్‌కతాలో ఆ పార్టీ అధ్యక్షురాలు, రాష్ట్ర సీఎం మమతా బెనర్జీతో ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ తరుపున కలిసి పనిచేయాలని నిర్ణయించారు. ఇటీవ‌ల జరిగిన ఎన్నిక‌ల్లో ప‌శ్చిమబెంగాల్లో బీజేపీ స‌త్తా చాటుకొని తృణ‌మూల్ షాకిచ్చిన నేప‌థ్యంలో...న‌ష్ట‌నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టిన దీదీ పార్టీకి పున‌ర్వైభ‌వం కోసం ప్ర‌శాంత్ కిశోర్ సేవ‌లు తీసుకుంటున్నారు. ప‌శ్చిమబెంగాల్‌లో పీకే వ్యూహ‌ర‌చ‌న ఎలా ఉంటుంద‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది.