పొంగులేటి.. ఎటువైపు...?

May 21, 2019

అతడొక అతి సామాన్యుడు (రాజకీయాలపరంగా)... అనతి కాలంలోనే అందరికీ చేరువయ్యాడు. అసామాన్యుడిగా ఎదిగాడు. అందరినీ ఆశ్చర్యపరిచేలా అపర చాణుక్యుడిగా మారాడు. ఆయనే... ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇతడికి ఇంత ఉపోద్ఘాతం, వర్ణన ఎందుకంటారా...? ఇది చదవండి... మీకే తెలుస్తుంది...

ఆయనొక బడా కాంట్రాక్టర్. వందల కోట్ల రూపాయలు పోగేసుకున్న కుబేరుడు. గత పార్లమెంట్ ఎన్నికలకు కొన్ని నెలల ముందుగా రాజకీయ తెర పైకి వచ్చారు. వైసీపీలో చేరారు. రాజకీయాలకు, జనాలకు కొత్తయినప్పటికీ... పకడ్బందీ ప్రణాళికతో ఎక్కడికక్కడ బడా-చోటా నాయకులను తనవైపు తిప్పుకున్నారు. అంతేకాదు, అప్పటికే జిల్లా రాజకీయాల్లో ఉన్న పాయం వెంకటేశ్వర్లు (పినపాక), మదన్ లాల్ (వైరా)ను తన అర్థ బలంతో గెలిపించారు. మొత్తంగా దాదాపుగా వంద కోట్ల రూపాయలను మంచినీళ్లలా ఖర్చు చేశారు. సునాయాసంగా గెలిచారు. పినపాక, వైరా, అశ్వరావుపేట నుంచి తన వాళ్లయిన పాయం వెంకటేశ్వర్లును, మదన్ లాల్, తాటి వెంకటేశ్వర్లును గెలిపించారు. కొన్నాళ్ల తరువాత, ఖమ్మం జిల్లాలో (ఇటీవలి వరకు) తిరుగులేని నాయకుడిగా నిలిచిన తుమ్మల నాగేశ్వరరావు ఆశీస్సులతో, గులాబీ గూటిలోకి చేరారు. ఆ తరువాత, ఆయన బాటలోనే వైసీపీ ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, మదన్ లాల్ కూడా గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. తర్వాతి కాలంలో ఈ ఇద్దరు ఎమ్మెల్యేలకూ, ఎంపీ పొంగులేటికీ మధ్య దూరం పెరిగింది. మదన్ లాల్ తోనైతే వైరమే ఏర్పడింది. ఇదంతా గతం.
ఇప్పుడు వర్తమానంలోకి వద్దాం. గులాబీ గూటికి చేరిన తరువాత ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, స్థానబలం పెంచుకున్నారు. టీఆర్ఎస్ క్యాడర్ ను తనవైపు తిప్పుకున్నారు. విపక్షాల నుంచి కొందరిని తనవైపు లాగేసుకున్నారు. తనకంటూ ప్రత్యేకమైన వర్గాన్ని కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసుకున్నారు. మొన్నీమధ్య జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని తన మనుషులకు టికెట్లు ఇప్పించుకునేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. దీంతో, ఆయన తీవ్రంగా కలతచెందారు. గులాబీ దళంలోని తన ప్రత్యర్థులు గెలిస్తే.. మున్ముందు స్వీయ రాజకీయ భవిష్యత్తుకు ప్రమాదం ఏర్పడుతుందని భావించిన, భ్రమించిన, భయపడిన పొంగులేటి... చక్రం తిప్పారు. కొత్తగూడెం, సత్తుపల్లి, పినపాక, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో తనకు నచ్చని (స్వపార్టీ) అభ్యర్థుల విజయానికి శ్రమించలేదు. ఎన్నికల ప్రచారంలో పొంగులేటి వర్గం... అంటీ ముట్టనట్టుగా ఉంది. మరీ ముఖ్యంగా, వైరా నియోజకవర్గంలోనైతే పార్టీ అభ్యర్థి మదన్ లాల్ ఓటమికి బహిరంగంగానే ఆయన వర్గం ‘శ్రమించింది’. కానీ, మధిర నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా నిలబడిన తన అనుచరుడైన లింగాల కమల్ రాజ్ గెలుపు కోసం పొంగులేటి నేరుగా రంగంలోకి దిగారు. తన శక్తినంతా ధారపోశారు. కానీ, గెలిపించుకోలేకోయారు. అక్కడ, పీసీసీ నేత భట్టి విక్రమార్క గెలిచారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మొత్తం పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క ఖమ్మం మినహా అన్నిచోట్ల టీఆర్ఎస్ ఓడిపోయింది. దీనంతటికీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డే కారణమని... ఓడిన టీఆర్ఎస్ అభ్యర్థులతోపాటు తుమ్మల నాగేశ్వరరావు వంటి సీనియర్ నేతలు కూడా అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. దీంతో, పొంగులేటిపై కేసీఆర్ గుస్సాగా ఉన్నారు. ‘‘పార్లమెంట్ ఎన్నికల్లో ఒకరిద్దరు సిట్టింగులకు టికెట్ దక్కకపోవచ్చు’’ అని, ఒకట్రెండు సందర్భాల్లో కేసీఆర్ ప్రకటించారు. ఆ ఒకట్రెండు సిట్టింగులలో ఖమ్మం ఒకటన్నది నిజం.
గతం, వర్తమానం చూశాం. ఇప్పుడిక... భవిష్యత్తును చూద్దాం. ఖమ్మం సిట్టింగ్ టీఆర్ఎస్ ఎంపీ పొంగులేటికి టికెట్ నిరాకరిస్తే... పార్టీ అభ్యర్థిగా ఎవరిని నిలబెడతారు...? ఇప్పుడిది ఆసక్తికర చర్చనీయాంశంగా మారింది. ఈ జిల్లాకు చెందిన బడా పారిశ్రామికవేత్త వంకాయలపాటి రాజేంద్రప్రసాద్ పేరు బలంగా వినిపిస్తోంది. కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఆయనకు నేరుగా ఇప్పటివరకు రాజకీయ నేపథ్యం లేదు. రాజకీయాలకు, టీఆర్ఎస్ పార్టీకి పూర్తిగా కొత్తవాడైన ఆయనను గులాబీ శ్రేణులు, ఓటర్లు ఎంతవరకు అంగీకరిస్తారు..? ఏమేరకు ఆదరిస్తారు...? రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పొంగులేటిని కాదని, కమ్మ సామాజిక వర్గానికి చెందిన రాజేంద్రప్రసాద్ ను నిలబెడితే... ‘రెడ్డి’ ఓట్లు పడతాయా...? ఇవన్నీ చర్చనీయాంశాలు.

మరి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజకీయ భవితవ్యమేమిటి...? ఆయన ఇండిపెండెంట్ గా నిలబడతారా...? కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతారా...? ఆ పార్టీలోకి వలస వెళ్లి, చేతి గుర్తుపై పోటీ చేస్తారా...? బీజేపీ జెండా కప్పుకుంటారా...? ఇందులో కచ్చితంగా ఏదో ఒకటి మాత్రం జరుగుతుంది. టీఆర్ఎస్ టికెట్ నిరాకరించినప్పటికీ... ఆయన పోటీలో ఉంటారు. అది, ఎలాగనేది మాత్రం ఇప్పుడే చెప్పలేం. టీడీపీ నేత నామా నాగేశ్వరరావును కాంగ్రెస్ లోకి చేర్చుకుని ఎంపీగా నిలబెట్టాలనేది ఆ పార్టీ పెద్దల ఆలోచనని వార్తలొస్తున్నాయి. ఇది కాకపోతే, పొంగులేటిని చేర్చుకుని, పోటీకి నిలపాలన్నది మరో ప్రత్యామ్నాయం. పొంగులేటి వస్తానంటే చేర్చుకునేందుకు బీజేపీ ఎప్పటి నుంచో సిద్ధంగా ఉంది. కేంద్రంలో మళ్లీ బీజేపీ ప్రభుత్వమే రావొచ్చని నేషనల్ మీడియా సర్వేలు చెబుతున్నాయి. పొంగులేటి, బీజేపీ నుంచి పొటీ చేసి గెలిచినా, ఇండిపెండెంట్ గా గెలిచి బీజేపీలో చేరినా... కేంద్రంలో మంత్రి పదవి అందుకునేందుకు అవకాశాలు మెండుగా ఉంటాయి. ఎందుకంటే, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీజేపీ బలం పెంచాలంటే... ఆర్థిక-అంగ బలమున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డితోనే సాధ్యం. ఇంకొక వార్త కూడా వినిపిస్తోంది. పొంగులేటికే టీఆర్ఎస్ టికెట్ ఇవ్వాలంటూ వైఎస్.జగన్ కూడా కేసీఆర్ ను కోరుతున్నారట. వైసీపీ తరఫున ఎంపీగా గెలిచి, టీఆర్ఎస్ లో చేరిన తరువాత కూడా జగన్మోహన్ రెడ్డితో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మంచి సంబంధాలే ఉన్నాయి. ఇదే నిజమైతే... జగన్ ఒత్తిడికి కేసీఆర్ తలొగ్గితే... పొంగులేటికి టీఆర్ఎస్ టికెట్ దక్కినట్టే. ఇన్ని పరిణామాలు... ఇన్ని మార్గాలు... ఇంతకీ, పొంగులేటి... ఎటువైపో.... !!??