ఒక‌నాటి వైఎస్ న‌మ్మిన‌బంటు... కేసీఆర్‌-జ‌గ‌న్ కు ప్రశ్నలు

July 11, 2020

హైదరాబాద్‌ ప్రగతిభవన్‌ వేదికగా తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్మోహన్‌ రెడ్డిల సమావేశం ముగిసింది. సుమారు 6 గంటల పాటు సాగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. విభజన సమస్యలు, గోదావరి జలాల మళ్లింపుతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ప్రజలకు ప్రయోజనం కలిగించే విధంగానే సహజ సరిహద్దు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అన్ని అంశాల్లో ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించాలని ముఖ్యమంత్రులు నిర్ణయించారు. అయితే, ఈ స‌మావేశంపై దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి న‌మ్మినబంటు అనే పేరొందిన మాజీ నీటిపారుద‌ల శాఖా మంత్రి మ‌రియు తెలంగాణ కాంగ్రెస్ సీనియ‌ర్ నేత పొన్నాల ల‌క్ష్మ‌య్య ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.
దాదాపు ఆరు గంటలకు పైగా ఇద్దరు ముఖ్యమంత్రుల కీలక భేటీ లో రహస్యాలు ఎందుకు ఉన్నాయ‌ని పొన్నాల ల‌క్ష్మ‌య్య ప్ర‌శ్నించారు. ఏకాంత చర్చలు చేయడంలో పారదర్శకత ఎక్కడ ఉంది? అని ఆయ‌న సందేహం వ్య‌క్తం చేశారు. ప్రజాస్వామ్య ప్రభుత్వాలలో అధికారులు లేకుండా ఇద్దరు ముజ్యమంత్రులు చర్చలు చేయడం వెనుక అంతర్యం ఏమిటి అని ఆయ‌న పేర్కొన్నారు. కృష్ణ-గోదావరి నదుల అనుసంధానం గురించే మాట్లాడితే నీటిపారుదల కార్యదర్శులు ఎందుకు సమావేశంలో లేరు అని నిల‌దీశారు.
తెలంగాణలో మునిసిపల్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో వైస్సార్ అభిమానులు తమవైపు వచ్చే ఉద్దేశంతో కేసీఆర్ ఆడిన దొంగ నాటకం ఇది అని పొన్నాల ల‌క్ష్మ‌య్య‌ ఆరోపించారు. ఆంధ్ర ప్రాంత ఓటర్లు ఉన్న మునిసిపాలిటీలలో కొద్దో, గొప్పో ఓట్లు వస్తాయని కేసీఆర్ ఆశ పడుతూ జగన్‌తో భేటీ పెట్టించుకున్నారు అని దుయ్య‌బ‌ట్టారు. వైఎస్సార్ మరణం తర్వాత కేసీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలు వైఎస్సార్ అభిమానులు, వైస్సార్సీపీ పార్టీ కార్యకర్తలు మరిచిపోవద్దు అని పేర్కొన్నారు.