పూజ హెగ్డే రెస్పాన్స్ అదుర్స్ !!

July 08, 2020

సినీతారలు.. క్రికెట్ స్టార్లు.. సెలబ్రిటీల మీద సామాన్యులకు ఉండే అభిమానం అంతా ఇంతా కాదు. వారిని కలుసుకునేందుకు.. మాట్లాడేందుకు.. సెల్ఫీ దిగేందుకు విపరీతంగా ప్రయత్నం చేస్తుంటారు. తాజాగా అలాంటి పనే చేసిన ఒక వీరాభిమాని చేష్టకు టాప్ హీరోయిన్ పూజా హెగ్డే తెగ ఇబ్బంది పడిపోయారు. అతడి గురించి తెలుసుకున్న ఆమె కదిలిపోయి.. అతడ్ని కలవటమే కాదు.. జాగ్రత్తగా ఇంటికి వెళ్లాలంటూ సున్నితంగా చెప్పటంతో పాటు.. తన కోసం ఇంత ఇబ్బంది పడటాన్ని ఆమె ఇబ్బందిగా ఫీలయ్యారు.
ఇంతకూ జరిగిందేమంటే? పూజా హెగ్డే అంటే భాస్కర్ రావు అనే అభిమానికి పిచ్చి అభిమానం. డీజే సినిమా నుంచి ఆమెకు వీరాభిమానిగా మారిపోయారు. తాజాగా పూజాహెగ్డేను చూడాలని.. ఆమెను కలవాలన్న ఉద్దేశంతో ముంబయికి వచ్చిన అతడు.. ఆమె కోసం ఏకంగా ఐదు రోజుల పాటు వెయిట్ చేశాడు. ఫుట్ పాత్ మీద పడుకొన్న అతని గురించి తెలుసుకున్న పూజా కదిలిపోయి.. అతడ్ని కలిశారు.
ఈ విషయాన్ని ఆమె తన ఇన్ స్టా అకౌంట్లో వెల్లడించి.. దానికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు. భాస్కర్ రావుతో మాట్లాడిన మాటల్ని వీడియో రూపంలో ఆమె షేర్ చేశారు. తనను చూడటం కోసం ఐదు రోజులు ఫుట్ పాత్ మీద పడుకున్న విషయాన్ని భాస్కర్ రావు చెప్పటంతో.. ఇంకెప్పుడు అలా చేయొద్దని.. ఇంటికి క్షేమంగా వెళ్లాలని చెప్పారు. అవసరమైతే తన సోషల్ మీడియా ఖాతాలో మెసేజ్ చేయొచ్చని.. అంతేకానీ ఇలా అభిమానాన్ని ప్రదర్శించొద్దని కోరారు.
తన అభిమానులు చేస్తున్న పని తనకు ఇబ్బంది కలిగిస్తోందని.. బాధ కూడా కలుగుతోందని.. ఇలా చేయటాన్ని తాను అస్సలు కోరుకోనని చెప్పారు. మీరెక్కడున్నా.. మీ ప్రేమను.. అభిమానాన్ని పొందుతూనే ఉంటా. మీరే నా బలం.. లవ్ యూ ఆల్ అని పూజా పేర్కొన్నారు. తన ఇన్ స్టా అకౌంట్లో షేర్ చేసిన వీరాభిమాని వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.