వాళ్లని కూడా వదలవా పోసాని?

May 30, 2020

ఈ మధ్య కాంటెంపరరీ ఉదాహరణలతో పురాణ సత్యాలను చెబుతూ అందరూ బాగా పాపులర్ అయిన ఇద్దరు వ్యక్తులు... చాగంటి కోటేశ్వరరావు, గరికపాటి నరసింహారావు. తెలుగు వాడుక భాషలో చాలా చమత్కారంగా ప్రకృతి, దేవుడు, వ్యక్తిత్వం వంటి విషయాలను నేర్పే వీళ్లపై పోసాని కృష్ణ మురళి కళ్లు పడ్డాయి.

అసలు ఈ సమాజానికి వీళ్ల అవసరమే లేదంటున్నారు పోసాని కృష్ణ మురళి. వాట్సప్ గ్రూపుల్లో వీళ్ల ప్రవచనాల్లో హైలెట్స్ షేరవుతూ ఎంతోమందిని ఇన్ స్పైర్ చేస్తుంటాయి. వాస్తవానికి ఈ ప్రవచనకారులు కొన్ని కమర్షియల్ సేవలు అందించినా... వీరి సేవలు చాలా వరకు ఉచితమే. టీవీలో వచ్చే ప్రవచనాలను చూడటానికి మనమేం వారికి ప్రత్యేకంగా ఫీజులు చెల్లించడం లేదు కదా. అయితే పోసాని మాత్రం వారు డబ్బులు కోసమే ఇవి చేస్తున్నట్లు విమర్శలు చేశారు. అంతేకాదు... చేపకు ఈత ఎవరు నేర్పారు? బిడ్డకు పాలు తాగడం ఎవరు నేర్పారు? అసలు ఇలాంటి వారు ఎవ్వరికీ ఏం నేర్పాల్సిన అవసరం లేదు అని పోసాని వాదిస్తున్నారు. వీరి ఉపయోగం ఏం లేదంటున్నారు పోసాని.

ఇంతవరకు బానే ఉంది. అందరూ ఎవరికి వారే నేర్చుకుంటారు. ఎవరూ ఎవరికీ నేర్పాల్సిన అవసరం లేదంటున్న పోసాని కృష్నమురళి తన పిల్లలను స్కూలుకు, ఇతర క్లాసులకు ఎందుకు పంపుతున్నారో? చెప్పాలి. పెద్ద నోరు వేసుకుని అన్నిటికీ తెగించి ఇలా ఎవ్వరికీ హానికరం కాని వారిపై పడి ఏడవటం ఏవిధంగా సబబో పోసాని చెప్పాలి.

ఇంతకీ పోసాని ఏమన్నాడో ఆయన మాటల్లో చూడండి...

‘ప్రవచనాలు చెప్పేవాళ్లను చూస్తే కోపం వస్తుంది. ఈ రోజుల్లో జనం చూసి నేర్చుకోవాల్సింది ఏమీ లేదు. మన పుట్టుకే నేర్పుతుంది. ఏ ప్రవచనం చూసి పుట్టిన బిడ్డ ఏడవడం మొదలెడతాడు? ఎవరు చెబితే చనుబాలు దగ్గరకు వెళ్తాడు. అది ఎవరు నేర్పారు? సొసైటీలో ఎవ్వరూ ఎవ్వరికీ నేర్పాల్సింది ఏదీ లేదు. తెలుసుకోవాల్సిందే. ప్రవచనాలు కొత్తగా ఏం నేర్పుతాయి? ఎవర్నీ ఎవరూ రెస్ట్రిక్‌ చేయకూడదంటున్నా. డబ్బులు తీసుకోకుండా ప్రవచనం చెప్పేవాళ్లు ఉన్నారా? మనిషికి ప్రవచనం అవసరం లేదు. క్యారెక్టర్‌ ఉంటే చాలు అన్నీ వచ్చేస్తాయి’