జగన్ మోసం చేశాడు... మా కర్థమైంది !

June 03, 2020

కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టేటపుడు అటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ఇటు దిగువన ఉన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను సంప్రదించి వారిని ఆహ్వానించి కట్టారు. అది కేసీఆర్ సంస్కారం. కానీ జగన్ మమ్మల్ని మోసం చేశారు. కనీసం మాట మాత్రమైన చెప్పకుండా పోతిరెడ్డి పాడు లిఫ్టుకు ఎత్తువేశారు. తద్వారా తెలంగాణను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. జగన్ మోసాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలుసు అని తెలంగాణ మంత్రి శ్రీనివాసరెడ్డి విమర్శించారు.

అయినా... తెలంగాణకు పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు ఉరి వంటిదని, దీనిని తెలంగాణ కాంగ్రెస్ నేతలు దగ్గరుండి ఆనాడు ప్రారంభించి తెలంగాణ గొంతుకోశారని శ్రీనివాస రెడ్డి వ్యాఖ్యానించారు. ఏపీ నేతల మా వాటాలో ఒక్క చుక్క కూడా దోపిడీ చేయకుండా ఏం చేేయాలో మాకు తెలుసు. జగన్ ఎత్తుకు పై ఎత్తు వేస్తాం. ఈరోజు ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నట్టు నటిస్తున్న ఉత్తమ్ ఆనాడు ఎందుకు వ్యతిరేకించలేదని ప్రశ్నించారు? ఇది గొప్ప ప్రాజెక్టు అని కాంగ్రెస్ అప్పట్లో పేపర్లలో వ్యాసాలు కూడా రాసిందన్నారు. 

అయితే... ఇపుడు ఏ రాష్ట్రమైనా వాటాల ప్రకారమే వాడుకుంటోంది. కేసీఆర్ తో జగడం పెట్టుకునేటంత పిచ్చోడు కాదు జగన్. ఎల్జీ పాలిమర్స్ గొడవతో అడ్డంగా దొరికిపోయిన ఏపీ సర్కారు ప్రజల దృష్టి మరలించడానికి ఈ ఎత్తుగడ వేసిందని పలువురు ఆరోపిస్తున్నారు. అదేసమయంలో తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలను ఇరుకున పెట్టడానికే కేసీఆర్ జగన్ చేసుకున్న ఉభయకుశలోపరి ఒప్పందంలో భాగమే ఈ వివాదం అని సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని రేవంత్ కూడా ఎండగట్టారు. కేసీఆర్ ఫిర్యాదు చేసిన కాపీ దమ్ముంటే తన నమస్తే తెలంగాణ పేపర్లోవేయాలని డిమాండ్ చేశారు. ఇదంతా ఉత్తనాటకం అని ఇద్దరికీ సఖ్యత ఉందని, తెలిసే పోతిరెడ్డి పాడు నాటకం రక్తికట్టిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే.