కరెంటుపై ప్రజల మాట: బాబు హిట్ - జగన్ ఫెయిల్

July 07, 2020

ఏపీలో విద్యుత్ కోతలు ఎంత తీవ్రంగా ఉన్నాయో ఏపీ మంత్రుల కోతలూ అంతే స్థాయిలో ఉన్నాయి. కరెంటు విషయంలో జగన్ ప్రభుత్వపు చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆయన కేబినెట్లోని మంత్రులు నానా పాట్లు పడుతున్నారు. రీసెంటుగా విశాఖలో చంద్రబాబు సమావేశం పెట్టినప్పుడు అక్కడ కరెంటు కోత ఏర్పడితే ఆయన దొరికిందే చాన్సుగా కరెంటు కోతల విషయంలో జగన్ ప్రభుత్వాన్ని ఏకిపడేశారు. దాంతో, విశాఖ విద్యుత్ అధికారులు కరెంటు కోత ఏమీ లేదు, విద్యుత్ లైన్లపై కాకి పడడం వల్ల కరెంటు ఆగిపోయిందని చెప్పారు.. పాపం, విద్యుత్ అధికారుల మాటలు నమ్మిన విశాఖ జిల్లా మంత్రి అవంతి శ్రీనివాస్ కూడా అదే కాకమ్మ కబురు మీడియాకు చెప్పేశారు.
ఇక విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ అయితే కేంద్రానికే కాకమ్మ కబుర్లు చెప్పే ప్రయత్నం చేస్తున్నారట. పీపీఏల రద్దు విషయంలో కేంద్రంతో ఏర్పడిన రగడ నేపథ్యంలో బాలినేని కేంద్రానికి ఓ లేఖ రాశారు. అది చదివితే జగన్ ప్రభుత్వం ఖజానాకు ఎంతో మిగల్చుతోంది అనిపిస్తుంది కానీ, అసలు సంగతి తెలిస్తే అవునా అని ముక్కున వేలేసుకోవాల్సి వస్తుంది.
‘‘సౌర, పవన విద్యుత్ వల్ల యూనిట్‌కు రూ.3.55ల (అడక్వెసీ కాస్ట్‌ రూ. 2.5, బాలెన్సింగ్‌ కాస్ట్‌ రూ. 1.05, గ్రిడ్‌ గ్రిడ్‌ అనుసంధాన ఖర్చు రూ. 0.25లు) భారం పడుతోంది. విద్యుత్ రంగంలో ప్రస్తుతం ఉన్న సంక్షోభాన్ని అధిగమించడానికి విద్యుత్‌ సరఫరా కంపెనీలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కలిసి సోలార్‌, విండ్‌ పవర్‌ల కంపెనీలతో నిరంతరాయంగా చర్చలు జరుపుతోంది, తగిన పరిష్కారమార్గాల కోసం ప్రయత్నాలు చేస్తోంది. వీటి వల్ల ఏటా ఏపీపై 5 వేల కోట్ల భారం పడుతోంది. ఈ సంక్షోభానికి పరిష్కారం చూపేందుకు కేంద్ర, రాష్ట్ర ఇంధన శాఖ ప్రతినిధులు, ఏపీ ప్రభుత్వ ఆర్థిక ప్రతినిధితో కలిపి కమిటీ వేయండి’’ అంటే బాలినేని కేంద్రానికి లేఖ రాశారు. ఈ లేఖలోనే ఆయన పంపిణీ నష్టాలను అధిగమించి ఏపీ ముందుకెళ్తున్నా ఈ భారం వల్ల నష్టపోతున్నామన్నారు. అంతేకాదు, రాష్ట్రంలో 15 వేల మిలియన్ యూనిట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి అవుతోందనీ చెప్పారు. ఇంత చెప్పినా ఇవన్నీ ఎలా సాధ్యమయ్యయో మాత్రం చెప్పలేదు. కారణం.. అవన్నీ 24 గంటల పాటు పల్లెలు, పట్నాలు అన్నిటికీ కరెంటు ఇచ్చిన చంద్రబాబు. ఆయన హయాంలోనే ఇవన్నీ జరిగాయి.
చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన ప్రగతి వల్లే ఏపీకి తక్కువ ధరకు విద్యుత్ దొరుకుతోంది. దేశంలో అనేక రాష్ట్రాలు 5 రూపాయలు పెట్టి విద్యుత్ కొంటుంటే.. ఏపీకి 3.55 కే కరెంటువస్తోంది. చంద్రబాబు హయాంలో సౌర, పవన విద్యుత్ కంపెనీలను ప్రోత్సహించడం మూలంగా భారీ సంఖ్యలో అతిపెద్ద కంపెనీలు వేల కోట్లు పెట్టుబడి పెట్టి రాయలసీమ ఈ ప్లాంట్లు ఏర్పాటుచేశాయి. దీంతో మిగతా రాష్ట్రాల కంటే తక్కువకు ఏపీకి విద్యుత్ దొరుకుతోంది. అంటే.. గత ప్రభుత్వం వీటిని ప్రోత్సహించకపోతే 15 వేల మిలియన్ యూనిట్ల ఉత్పత్తి మన వద్ద ఉండేది కాదు. అదే పరిస్థితి ఉండుంటే విద్యుత్ కు డిమాండ్ ఇంకా పెరిగి యూనిట్‌కు 7 రూపాయలు పైగా డబ్బులు పెట్టాల్సి వచ్చేది.
పీపీఏలపై సమీక్ష పేరుతో జగన్ ప్రభుత్వం హడావుడి చేయగా కేంద్రం తలంటివదిలింది. దీంతో కమిటీ వేయమని కొత్త వాదన ఎత్తుకుంటోంది ఏపీ ప్రభుత్వం. అయితే బాలినేని రాసిన లేఖలో చంద్రబాబు హయాంలో పంపిణీ నష్టాలు తగ్గాయని, 15 వేల మిలియన్ యూనిట్ల సౌరవిద్యుత్ సామర్థ్యం ఏర్పడిందని పరోక్షంగా అంగీకరించారు. చంద్రబాబు అన్ని సమకూర్చిపెట్టినా కూడా కోతల్లేకుండా కరెంటు ఇవ్వలేకపోయామని కూడా ఆయన పరోక్షంగా అంగీకరించినట్లయింది.