అధికార మదం కాదా!

August 07, 2020

జనం 151 సీట్లిస్తే చక్రవర్తివి అయిపోతావా?
సీఎంకు మాత్రమే విచణక్షాధికారమా?
ఎన్నికల కమిషనర్‌కు ఉండదా?
అనుకూలంగా పనిచేస్తే గొప్ప
లేదంటే ‘కమ్మ’ కులముద్ర
నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్న జగన్‌
కరోనాపై ఏమీ తెలియని అజ్ఞానం
వారం రోజుల్లో కొంపలేమీ మునగవట!
స్థానిక ఎన్నికల వాయిదా కూడదట!!
‘సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేస్తే 151 స్థానాల్లో ఎమ్మెల్యేలు విజయం సాధించారు. ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తేనే నేను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుకున్నాను. ప్రజలు మెజారిటీ స్థానాలు గెలిపించినందునే అధికారంలో ఉన్నాను. సీఎంగా నాదా అధికారం.. నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌దా’ అని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. మాజీ సీఎం చంద్రబాబుది, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌కుమార్‌దీ ఒకే సామాజిక వర్గమని.. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ స్వీప్‌ చేస్తుందన్న భయంతోనే ఎన్నికలను ఆకస్మికంగా వాయిదావేశారని మండిపడ్డారు. కరోనా వ్యాధి సాకుతో ఈ నిర్ణయం తీసుకున్నారని.. వారం రోజులు ఆగితే కొంపలేమీ మునిగిపోవని కూడా గత నెల 18వ తేదీన విలేకరుల సమావేశం పెట్టి మరీ చెప్పారు. కరోనా వైరస్‌ ప్రపంచమంతా ఎలా విస్తరిస్తోందో.. దేశంలో మిగతా రాష్ట్రాలు ఎలా భయపడుతున్నాయో ఆయనకు ఏ మాత్రం అవగాహన లేదని తేలిపోయింది. ఆనాటికి పొరుగున ఉన్న తెలంగాణలో  ఏం జరుగుతోందో తెలియని అజ్ఞానంలో అన్నారు. దేశంలో ఏ సీఎం కూడా బహుశా ఇంత అధికార మదంతో మాట్లాడి ఉండరు. మనం ఉండేది ప్రజాస్వామ్య వ్యవస్థలోనని.. ముఖ్యమంత్రి అయినా రాజ్యాంగానికి లోబడి వ్యవహరించాలని.. నేను గెలిచాను కాబట్టి రాజ్యాంగ వ్యవస్థలన్నీ గుడ్డిగా తన మాటే వినాలనుకునే ఈ మనస్తత్వం మరే నేతకూ ఉండదు. ఎందుకింత తెంపరితనం? రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సామాజిక వర్గం ఒక్క రోజులోనే జగన్‌కు గుర్తుకొచ్చిందా? నామినేషన్లు వేయకుండా వైసీపీ నేతలు చేసిన దౌర్జన్యాలు, దాడులు.. ఏకగ్రీవాల పేరిట హింసాకాండ.. వీటన్నిటినీ చూస్తూ కళ్లు మూసుకున్నన్నాళ్లూ రమేశ్‌కుమార్‌ మంచివాడుగా కనిపించారు. కానీ ఇతర రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లను సంప్రదించి.. ఆయన ఎన్నికలు వాయిదా వేయగానే చెడ్డవాడైపోయారు. గవర్నర్‌కు నేరుగా ఫిర్యాదుచేసి.. సీఎంగా పగ్గాలు చేపట్టాక హడావుడిగా తొలిసారి విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి.. తన అనుకూల మీడియాను మాత్రం పిలిపించుకుని.. కమిషనర్‌ను నానా దుర్భాషలాడి మళ్లీ తెరచాటుకు వెళ్లిపోయారు. తెరవెనుక ఆయన్ను తొలగించేందుకు కసరత్తు చేయించారు. చివరకు హైకోర్టు న్యాయమూర్తి హోదా ఉన్న వ్యక్తి ఎస్‌ఈసీగా ఉండాలంటూ చట్టాన్ని సవరించి ఆర్డినెన్స్‌ను రూపొందించి గవర్నర్‌కు పంపారు. కమిషనర్‌ కాలపరిమితిని కూడా మూడేళ్లకు కుదించారు. దీనికి గవర్నర్‌ వెంటనే ఆమోదముద్ర వేయడం.. ఆ వెంటనే రమేశ్‌కుమార్‌ను తొలగిస్తూ జీవో ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. ఇది రాజ్యాంగ విరుద్ధమని.. కోర్టులో నిలవదని తెలిసినా జగన్‌ దురహంకారంతో ముందుకెళ్తున్నారు.
విచక్షణ లేకుండా..
విచక్షణ అంటే ఏమిటో తెలియకుండా విచక్షణ లేకుండా జగన్‌ మాట్లాడారు. ‘విచక్షణాధికారం అని ఎన్నికల కమిషనర్‌ అంటున్నారు. ఈ మధ్య ప్రతివాడూ ఈ మాటంటున్నారు. ప్రజల చేత ఎన్నికైన సీఎం కంటే రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఎక్కువ అధికారాలు ఉంటాయా? అలాగైతే రాష్ట్రాన్ని కూడా ఆయనే పరిపాలించొచ్చుగా’ అని మండిపడ్డారు. నిష్పాక్షికంగా ఉండాల్సిన కమిషనర్‌ విచక్షణ కోల్పోయారని చెప్పారు. పైసా సొంత పెట్టుబడి లేకుండా కంపెనీలు పెట్టడం.. దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు లాభాపేక్షతో ఆ కంపెనీల్లో వందల కోట్లు పెట్టుబడులు పెట్టడం (షేర్లను అధిక ధరలకు కొని) కనీవినీ ఎరుగం. క్విడ్‌ ప్రొ కో (నీకిది.. నాకిది) విధానమొకటి ఉందని జగన్‌ ద్వారా యావద్దేశానికీ తెలిసింది. సీఎం అయ్యాక ఇదే విధానం అమలు చేస్తున్నారు. తన విచక్షణాధికారాన్ని ఉపయోగించి పోలవరం, ఇతర ప్రాజెక్టుల కాంట్రాక్టర్లను మార్చేశారు. రివర్స్‌ టెండరింగ్‌ పేరిట తనకు నచ్చిన కాంట్రాక్టర్లకు ఆ పనులు ఇప్పించారు. స్థానిక ఎన్నికల్లో టీడీపీ, ఇతర పార్టీల అభ్యర్థులపై వలవిసిరారు. వలంటీర్లను ఎన్నికల ప్రచారంలోకి దించారు. ఇప్పుడు నిస్సిగ్గుగా కరోనా సాయాన్ని తన పార్టీ నేతలతో లబ్ధిదారులకు ఇప్పించి.. తమకే ఓటువేయాలని ప్రచారం చేయించారు. ఇదంతా విచక్షణతోనే చేశారు మరి.
అడ్డగోలు వాదనలు..
మార్చి నెలాఖరులోగా స్థానిక ఎన్నికల ప్రక్రియ పూర్తవ్వకపోతే.. 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.5,000 కోట్లు రాష్ట్రానికి రావని జగన్‌ మీడియా సాక్షిగా పచ్చి అబద్ధం చెప్పారు. ఎందుకంటే ఆయనీ వ్యాఖ్యలు చేసిన పది రోజుల్లోనే ప్రతి రాష్ట్రానికీ ఈ నిధులు విడుదల కావడం గమనార్హం. ‘ఎన్నికల కమిషనర్‌ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. అభివృద్ధి జరగకూడదు.. నిధులు రాకూడదు.. ఇంకా అధికారం చలాయించాలని చూస్తున్నారు. ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు ఆపేస్తున్నారు. ఇది సబబేనా అని అధికారంలో ఉన్నవారు ఆలోచించాలి’ అని అన్నారు. విచక్షణాధికారం పేరిట ఇష్టారీతిన వ్యవహరించే అధికారం కమిషనర్‌కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఎన్నికల వాయిదాపడిన విషయం ఎన్నికల కమిషన కార్యదర్శికి కూడా తెలియదన్నారు. ‘అంటే.. ఈ ఆదేశాలను ఎవరో రాశారు. నిమ్మగడ్డ రమేశకుమార్‌ చదివారు. అంటే.. ఈ ఆదేశాలను వెనుకుండి ఎవరో రాశారు’ అని అడ్డగోలు ఆరోపణ చేశారు. ఓ ప్రభుత్వాధిపతి మాట్లాడే మాటలేనా ఇవి? ఆయన అధికారంలోకి వచ్చాక ఎన్నో అన్యాయమైన జీవోలిచ్చారు. వాటిలో చాలామటుకు హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు కూడా ఎవరో రాసిచ్చిందే తీర్పుగా చెప్పిందా? ఇలాంటి మొండివాదంతో ఎన్నాళ్లు ప్రజలకు మభ్యపెడతారో చూడాలి.
 
 
 
 
-