డార్లింగ్ లో కొత్త యాంగిల్

February 21, 2020

ఇప్పుడందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం సాహో. భారీ బడ్జెట్ తో.. ఇప్పటివరకూ ఉన్న రికార్డుల్ని బ్రేక్ చేయాలన్న కసిగా ఉన్న సాహో రిలీజ్ డేట్ ఎంత త్వరగా వస్తే బాగుండన్నట్లుగా ఉంది. ఈ నెల 30న విడుదలవుతున్న ఈ చిత్రంలో ప్రతికథానాయకుడిగా కీలకపాత్ర పోసించారు నీల్ నితిన్ ముఖేష్.
సాహో టీంతో తనకున్న అనుబంధం గురించి చెప్పే క్రమంలో ఒక ఆసక్తికర అంశాన్ని చెప్పాడు. బాహుబలి మూవీ షూటింగ్ సమయంలోనే తనకు సాహో చిత్రం గురించి చెప్పారని.. తనకు బాగా నచ్చిందన్నారు. ఆ చిత్రంలో అవకాశం వచ్చిందని చెప్పినా.. దాదాపు రెండేళ్ల వరకూ కబురు రాకపోవటంతో ఛాన్స్ మిస్ అయ్యిందని తాను భయపడినట్లు చెప్పారు.
సినిమాలో అవకాశం రావటం.. నటించటం.. చిత్రం కోసం కష్టపడటం లాంటివి ఒక ఎత్తు అయితే.. డార్లింగ్ ప్రభాస్ గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. బాహుబలి లాంటి భారీ సక్సెస్ తర్వాత కూడా ప్రభాస్ స్టార్ హీరోలా వ్యవహరించరని చెప్పాడు. సౌమ్యంగా ఉండటమే కాదు.. వినయంగా ఉంటారన్నారు. తాను అనుకున్న దాని కంటే ఎక్కువ రోజులే ఈ సినిమా కోసం పని చేయాల్సి వచ్చిందన్నారు. సినిమా షూటింగ్ అబుదాబిలో జరుగుతున్నప్పుడు తన భార్య రుక్మిణి ప్రెగ్నంట్ అని.. ఆ విషయం తెలిసిన ప్రభాస్ ఆమె వద్దకు వెళ్లి.. చాలా బహుమతులు ఇచ్చారని.. ఇది చాలా గొప్ప విషయంగా అభివర్ణించారు. స్నేహానికి డార్లింగ్ ఇచ్చే ప్రాధాన్యత గురించి ఇండస్ట్రీలో కథలు..కథలుగా చెబుతుంటారు. అందుకు తగ్గట్లే తాజా ఉదంతం సాహో విలన్ చెప్పేయటం చూస్తే.. ప్రభాస్ స్పెషాలిటీ ఏమిటో ఇట్టే అర్థం కాక మానదు.