కరోనా ఎఫెక్ట్.. ప్రయివేట్ జెట్‌ వాడిన ప్రభాస్

August 07, 2020

సినీ హీరో ప్రభాస్ కరోనా వైరస్ బారిన పడకుండా ఉండేందుకు ప్రయివేట్ జెట్లో విదేశాల నుంచి భారత్‌కు చేరుకున్నారు. సినిమా షూటింగ్ కోసం జార్జియా వెళ్లిన ప్రభాస్ అక్కడి నుంచి టీంతో సహా భారత్‌కు సురక్షితంగా చేరుకున్నారు.
'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తాను నటిస్తున్న చిత్రం షూటింగ్ కోసం జార్జియా వెళ్లిన ప్రభాస్ సాధారణ ప్రయాణికుల విమానంలో కాకుండా ప్రత్యేక విమానంలో వచ్చారు. కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న నేపథ్యంలో జార్జియా నుంచి చిత్ర యూనిట్ ప్రైవేట్ జెట్ విమానంలో ఇండియాకు తిరిగి వచ్చింది. విమానంలో ప్రభాస్ ఉన్న చిత్రాన్ని రాధాకృష్ణ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ చిత్రంలో నిర్మాత ప్రమోద్, నటుడు ప్రభాస్ శ్రీను తదితరులు కనిపిస్తున్నారు. ఇక, జార్జియాలో షూటింగ్ ను ఎలాంటి అసౌకర్యమూ లేకుండా పూర్తి చేశామని రాధాకృష్ణ తెలిపారు.
కాగా కరోనా ప్రభావిత దేశాల్లో జార్జియా కూడా ఉంది. ఇప్పటివరకు అక్కడ 38 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో ఒకరు ఇప్పటికే నయమై ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కాగా మిగతా 36 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ప్రస్తుతం జార్జియా నుంచి ఇతర దేశాలకు విమానాలను నిషేధించారు. దీంతో ప్రయివేట్ జెట్‌లో ప్రభాస్, చిత్ర బృందం భారత్ వచ్చింది.