కుప్పంలో రచ్చ... బాబు స్పీచులో హీటు

June 01, 2020

వైసీపీ పరిపాలన ద్వారా పేరు తెచ్చుకోవడం కంటే కూడా ... చంద్రబాబును డ్యామేజ్ చేయడం ద్వారా, ఆయనను టార్గెట్ చేయడం ద్వారా ఎక్కువ పేరును సంపాదించుకోవాలని చూస్తోంది. ముఖ్యంగా మంచి పనులు చేయడం ద్వారా అధికారంలోకి రావచ్చు, రాకపోవచ్చు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీ మినహా మరో బలమైన పార్టీ ఏపీలో లేనందున... ఆ పార్టీని నాశనం చేస్తే జనసేన, బీజేపీ పుంజుకునే లోపు ఓ పదిహేనేళ్లు పడుతుందని, రాజ్యం నాదే అన్న భ్రమల్లో జగన్ మునిగితేలుతున్నట్లు కనిపిస్తుంది. రన్నింగ్ రేసులో ఒకరే ఉంటే... మనదే ఫస్ట్ ర్యాంక్ కదా. కష్టపడి ప్రాక్టీస్ కూడా చేయాల్సిన అవసరం లేదు. అందుకే రాష్ట్రం అభివృద్ధి చేయడం ద్వారా వచ్చే లాభం కంటే.. చంద్రబాబును టార్గెట్ చేసి, టీడీపీని నాశనం చేయడం ద్వారా ఎక్కువ లాభం ఉందని గ్రహించిన జగన్... ఆ పార్టీని టార్గెట్ చేశారు. చివరకు చంద్రబాబు సొంత నియోజకవర్గంలో కూడా బలప్రదర్శన చేసే దిశగా ముందుకు సాగుతున్నారు. 

ఈరోజు చంద్రబాబునాయుడు కుప్పంలో పర్యటించారు. సాధారణంగా బాబు పర్యటనకు తెలుగుదేశం నాయకులు హడావుడి చేయాలి. కానీ వైసీపీ నాయకులు కట్టిన వ్యతిరేక ఫ్లెక్సీలే...టీడీపీ కట్టిన అనుకూల ఫ్లెక్సీల కంటే ఎక్కువ ఉన్నాయి. చివరకు భారీ పోలీసు బందోబస్తు మధ్య బాబు పర్యటించాల్సి వచ్చింది. దీంతో అక్కడి ప్రసంగంలో చంద్రబాబు జగన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.  పులివెందుల తరహా రాజకీయం చేస్తామంటే కుదరదు. రౌడీయిజం చేస్తే తోకలు కట్ చేస్తామని చంద్రబాబు సీఎం జగన్‌ను హెచ్చరించారు. జగన్ సారథ్యంలోని వైసీపీ ప్రభుత్వం రంగుల మార్చే ప్రభుత్వమని చాలా వేగంగా ప్రజలకు అర్థమైందని ఆరోపించారు చంద్రబాబు. ఏం చేసినా నడవడానికి ఇదేమీ పులిివెందుల కాదు, రాజరిక పాలనా కాదు. తప్పులు చేస్తే ప్రజాస్వామ్యంలో దోషులుగా నిలబెడతాం అని చంద్రబాబు హెచ్చరించారు. పోలీసులను బానిసలుగా చేయాలనుకుంటున్నారు. పోలీసులు ఒత్తిడికి తలొగ్గకుండా చట్టాన్ని గౌరవించి కాపాడాలి. ఎవరికీ తొత్తుల్లా మారొద్దని చంద్రబాబు హెచ్చరించారు.