ఏపీలో దిగ్బ్రాంతికర ఘటన.. చంద్రబాబు తీవ్ర ఆగ్రహం

August 15, 2020

ఏపీ మద్యం పాలసీ కారణంగా... రాష్ట్రంలో అనేక ఘోరాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో అధిక ధరలున్న నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి మద్యం స్మగ్లింగ్ చేయడం, సారా మాఫియా  పుట్టుకొచ్చాయి. మద్యం ధరలు ఎక్కువగా ఉండటం, వాటికోసం భారీ క్యూలో నిల్చోవాల్సి రావడం, పక్క రాష్ట్రంలో దొరికే బ్రాండెడ్ మద్యం కంటే నాటా సారా రేటు ఏపీలో ఎక్కువగా ఉంటోంది. దీంతో అదీ, ఇదీ రెండూ కొనలేక ఏపీలో మందు అలవాటు ఉన్నవారు పిచ్చోళ్లపోతున్నారు. ఈ క్రమంలో శానిటైజర్ లో 60 శాతం  ఆల్కహాల్ ఉంటుంది కాబట్టి తాగితే ఏంకాదన్న భావనతో దానిని తాగేసి పది మంది బలైపోయారు.

ప్రకాశం జిల్లాలోని కురిచేడులో శానిటైజర్ తాగి 10 మంది మృతి పట్ల తెలుగుదేశం పార్టీ అధినేత‌ చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ విధానాల వల్ల సంభవించిన మరణాలు అని, దీనికి జ‌గ‌న్ స‌ర్కార్ బాధ్య‌‌త వ‌హించాల‌నీ, మృతుల కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు డిమాండ్ చేశారు. 

ఎక్కడైనా మద్యపాన నిషేధం పెడితే ప్రజలకు మేలు జరగాలని... కానీ ఏపీలో రివర్సులో జరుగుతోందన్నారు. ప్ర‌భుత్వం మ‌ద్యం మాఫియాను అరిక‌ట్టాల‌ని అన్నారు. ఏపీ మద్యం పాలసీ వల్ల తరచూ ఇలాంటి దుర్ఘటనలు పదేపదే చోటుచేసుకోవడం విచారకరమైన చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు.  

రాష్ట్రంలో 14 నెలలుగా కల్తీ మద్యం దుర్ఘటనలు బాగా పెరిగాయన్నారు. నాటు సారా తాగి, కల్తీ మద్యం తాగి, శానిటైజర్లు తాగి పలువురు చనిపోతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తోందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దేశంలో ఎక్కడా లేనట్లు రాష్ట్రంలో మద్యం ధరలు రెండు మూడు రెట్లు పెంచారని చంద్రబాబు విమర్శించారు. నాసిరకం బ్రాండ్లతో ప్రజల ఆరోగ్యం సర్వనాశనం చేస్తున్నారని ధ్వ‌జమెత్తారు. 

రాష్ట్రంలో మునుపటి కంటే ఎక్కువగా మద్యం పొంగిపొర్లుతోందని... ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణా భారీగా పెరిగిపోయిందన్నారు. గడ్డివాములు, మొక్కజొన్న మోపు లారీలు, ఊక లారీలు... ఎక్కడ చూసినా అక్రమ మద్యం స్మగ్లింగ్ జరుగుతోందని చంద్రబాబు ఆరోపించారు. వైసిపి కార్యకర్తలే మొబైల్ బెల్ట్ షాపులను నిర్వ‌హిస్తున్నారని, పాలన ప్రజల వద్దకు తెమ్మంటే బెల్టు షాపులు తెచ్చారన్నారు. విచిత్రమైన ధరలతో పేదల ఆదాయం మొత్తం లాగేసుకుంటున్నారని అన్నారు. సాక్షాత్తూ అసెంబ్లీ స్పీకర్ నాటు సారా మద్యం అక్రమ రవాణా గురించి మాట్లాడుతున్నారని అన్నారు.  వైసీపీ మద్యం మాఫియాకు సామాన్యులు బలైపోతున్నారని చంద్రబాబు ఆరోపించారు.