ఎన్నికల సంఘానికి చురక ...

July 04, 2020

తప్పు... ఒప్పు... అనేది తరచిచూడకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఎన్నికల సంఘంపై ఈసారి వచ్చినన్ని విమర్శలు మనం ఎన్నడూ వినలేదు. తాజాగా ఈ దేశంలో అత్యంత సీనియర్ పొలిటీషియన్, రాజనీతి వేత్త, మాజీ రాష్ట్రపతి అయిన ప్రణబ్ ముఖర్జీ ఎన్నికల సంఘానికి చురక అంటించారు.

ఈవీఎంల మార్పు, ట్యాంపరింగ్ అంటూ వస్తున్న వార్తలు అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నాయని... ఈ విషయంలో చాలా జాగ్రత్త అవసరం అని ఎన్నికల సంఘానికి సూచిస్తూ ఆయన ఓ సీరియస్ లేఖ రాశారు. ప్రజాతీర్పును భద్రంగా కాపాడాల్సిన బాధ్యత స్వతంత్ర సంస్థ అయిన ఎన్నికల సంఘంపై ఉందని ఆయన సూచించారు. ఈవీఎంలపై వచ్చే అనుమానాలు... ప్రజాస్వామ్య పునాదులను అనుమానించేలా చేస్తాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటివి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే అని ఆయన సూచించారు. అసలు ఎన్నికల కమిషన్ నిబద్ధతపై అనుమానాలు రావడం చాలా ప్రమాదకర సూచిక అని, ఇలాంటి అనుమానాలు రాకుండా చర్యలు తీసుకోమని ఎన్నికల సంఘానికి ప్రణబ్ ముఖర్జీ సూచించారు. 

ఇప్పటికే ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎన్నికల సంఘం ప్రణబ్ లేఖతో ఒకింత ఆందోళనకు గురయ్యింది. అంతేకాదు, ఈరోజు ఈవీఎంల తరలింపు అబద్ధం అంటూ ఒక ప్రకటన కూడా చేసింది. వీడియోలు పాతవి అని చెప్పింది. పాతవి అనే పేర్కొనడంపై కూడా విమర్శలు వచ్చాయి. అంటే గత ఎన్నికల్లో ఇలా చేశారా అంటూ అనుమానం కలిగేలా ఎన్నికల సంఘం జవాబు ఉంది.