ప్రశాంత్ కిషోర్ ఇజ్జత్ కా సవాల్ ఇపుడు !

July 13, 2020

సార్వ‌త్రిక ఎన్నిక‌ల ముందు నుంచే ప‌శ్చిమ‌బెంగాల్ లో రాజ‌కీయం ఎంత‌గా వేడెక్కిందో తెలిసిందే. దేశంలో మ‌రే రాష్ట్రంలో లేన‌ట్లుగా.. బీజేపీ.. తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీలు బెంగాల్ లో మాత్రం ముఖాముఖిన పోటీ ప‌డిన ప‌రిస్థితి. దేశంలో బెంగాల్ లో చోటు చేసుకున్నంత ఎన్నిక‌ల హింస మ‌రే రాష్ట్రంలోనూ చోటు చేసుకోలేదు.
ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత కూడా బెంగాల్ లో రాజ‌కీయ వేడి అస్స‌లు త‌గ్గ‌ట్లేదు. ఇదిలా ఉంటే.. త‌న రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌గా పీకే అలియాస్ ప్ర‌శాంత్ కిషోర్ ను దీదీ ఎంపిక చేసుకోవ‌టంతో ఈ వ్య‌వ‌హారం మ‌రింత ఆస‌క్తిక‌రంగా మారింది. ఎందుకంటే.. కొద్ది నెల‌ల్లో ప‌శ్చిమ‌బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. లోక్ స‌భ ఎన్నిక‌ల్లో వ‌చ్చిన సీట్ల బ‌లంతో..ఈసారి ఎన్నిక‌ల్లో ఎట్టి ప‌రిస్థితుల్లో బెంగాల్ లో బీజేపీ జెండా ఎగ‌రాల‌న్న ప‌ట్టుద‌ల‌తో మోడీషాలు ఉన్నారు. ఇందుకు సంబంధించి వారెంత ప‌ట్టుద‌ల‌తో ఉన్నార‌న్న విష‌యాన్ని సార్వ‌త్రిక ఎన్నిక‌ల సంద‌ర్భంగా త‌న ప్ర‌చారంతో చెప్ప‌క‌నే చెప్పేశారు మోడీషాలు.
రాష్ట్రం ఏదైనా స‌రే.. వ్యూహ‌క‌ర్త‌గా తాను ఒప్పుకున్న చోట ఫెయిల్ కాకుండా ప‌ని చేస్తున్న పీకేకు.. ప‌శ్చిమ‌బెంగాల్ ఇప్పుడు పెద్ద టాస్క్ గా మారింద‌ని చెప్పాలి. దీదీకి ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా పీకే ఓకే చేసిన త‌ర్వాత తృణ‌మూల్ నేత‌ల్లో.. కార్య‌క‌ర్త‌ల్లో స్థైర్యం మ‌రింత పెరిగితే.. బీజేపీ నేత‌లు దాన్ని దెబ్బ తీసే కార్య‌క్ర‌మానికి తెర తీశారు.
త‌మ ఎన్నికల వ్యూహ‌క‌ర్త‌గా ప్ర‌శాంత్ కిశోర్ ను దీదీ ఎంపిక చేసిన వైనంపై ఇప్ప‌టికే ప‌లువురు స్పందించ‌గా.. తాజాగా బీజేపీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ కైలాశ్ విజ‌య్ వ‌ర్గీయ మాట్లాడారు. తమ పార్టీ అధ్య‌క్షుడు అమిత్ షాకు మించిన రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ఎవ‌రు ఉన్నార‌న్న ప్ర‌శ్న వేసిన ఆయ‌న‌.. ఈ విష‌యాన్ని అంద‌రూ మ‌ర్చిపోయార‌న్నారు. షా మంచి వ్యూహ‌క‌ర్త అని.. ఈ విష‌యం తాజాగా జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌లు స్ప‌ష్టం చేసిన‌ట్లు గుర్తు చేశారు.
రాజ‌కీయాలు తెలియ‌క‌నే బెంగాల్ సీఎం మ‌మ‌త ఇత‌రుల మీద ఆధార‌ప‌డుతున్న‌ట్లుగా విమ‌ర్శించిన ఆయ‌న‌.. రాజ‌కీయమ‌నే కాలేజీలో అమిత్ షా ప్రిన్సిప‌ల్ అయితే.. పీకే స్టూడెంట్ గా అభివ‌ర్ణించారు. 2014 ఎన్నిక‌ల వేళ‌లో బీజేపీకి.. త‌ర్వాత జేడీయూకి ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా ప‌ని చేసిన పీకే.. రెండు చోట్ల విజ‌యాన్ని సాధించ‌టమే కాదు.. తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా ప‌ని చేయ‌టం.. చారిత్ర‌క ప‌లితాలు వెలువ‌డ‌టం తెలిసిందే. ఏమైనా బీజేపీ నేత‌ల మాట‌లు చూస్తే.. పీకే ఇజ్జ‌త్ కా స‌వాల్ అన్న‌ట్లుగా బెంగాల్ ఎన్నిక‌లు ఉన్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.