లేటెస్ట్: చైనాలో ఇపుడు ఎలా ఉంది

August 13, 2020

కరోనా వైరస్ మహమ్మారి పుట్టిన చైనాలో ఇపుడు పరిస్థితి ఏంటి అనే విషయం ఆసక్తికరంగా ఉంది. చైనాలో మొదట వ్యాధి బయటపడిన వుహాన్ లో అయితే కొత్త కేసులు నమోదే కావడం లేదు. కానీ చైనాలో మాత్రం కొత్తకేసులు నమోదవుతున్నా చాలా తక్కువ. తాజాగా ఈ వ్యాధి నుంచి దేశం బయటపడుతోందని చైనా అధికారికంగా వెల్లడించింది. అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే... అక్కడ ప్రస్తుతం 5120 మంది మాత్రమే ఈ వ్యాధితో ఉన్నారు. వారు కూడా చికిత్సలో ఉన్నారు. 

మొత్తం చైనాలో ఇంతవరకు 81093 కేసులు నమోదయ్యాయి. అయితే, చైనా యుద్ధప్రాతిపదికన ఈ వైరస్ నియంత్రణకు చర్యలు చేపట్టింది. రోగులను గుర్తించడంలో, వారికి చికిత్స చేయడంలో, ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా కట్టడి చేయడంలో చైనా తీసుకున్న చర్యలు విజయవంతమైన ఫలితాలను ఇచ్చాయి. అందుకే ఆ దేశంలో పుట్టిన వైరస్ ఆ దేశాన్ని పెద్దగా కబళించలేదు. మొత్తం కేసుల్లో అత్యధికులు అంటే 72703 కేసుల్లో రోగులకు వ్యాధి నయమైంది. వారు ఆరోగ్యంగా ఇంటికి వెళ్లారు. కేవలం 3270 మంది మాత్రమే చైనాలో దీని వల్ల మరణించారు. ప్రస్తుతం మిగతా 5120 మంది చికిత్సలో ఉన్నారు. వీరు కూడా కోలుకుంటున్నారు. ఏప్రిల్ చివరి నాటికి చైనా సమూలంగా ఈ వైరస్ నుంచి బయటపడే అవకాశం కనిపిస్తోంది. ఈ లెక్కలు ఆదివారం అర్ధరాత్రి వరకు నమోదైన సమాచారం ఆధారంగా ఖరారుచేసినవని చైనా వెల్లడించింది. 

కొసమెరుపు ఏంటంటే... ఈ వైరస్ యూరప్ ను అతలాకుతలం చేసింది. ఇటలీ కన్నీరు పెడుతోంది. పశ్చిమాశియాలో ఇరాన్ దీనికి పూర్తిగా బలైంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కరోనా మాంద్యంలోకి నెట్టింది.