తాగుబోతుల వద్ద జగన్ ఆటలు చెల్లవు

August 06, 2020

‘‘మద్యం ధరలు పెంచితే మద్యానికి దూరంగా ఉంటారట... ’’

ఇది వైసీపీ కనిపెట్టిన గొప్ప సూత్రం. ఇంతకంటే మోసపూరిత విధానం ఎక్కడనా ఉంటుందా? 

ఒకవైపు ఆదాయం లేదు, మరో వైపు కరోనా సోకే ప్రమాదం ఉంది... అయినా ఏ భయం లేకుండా చేపలు, మాంసం దుకాణాలకే ఎగబడ్డ జనం... మందు కోసం ఎగబడరా? పెరిగిన రేట్లు వారిని ఆపగలవా? చివరకు మాంసం దుకాణాల వద్ద రద్దీ తట్టుకోలేక వాటిని బంద్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మరి మాంసం అనేది వ్యసనం కాదు... రుచి, ఇష్టం. మరి దానికే అలా ఎగబడిన జనం... వ్యసనం కోసం ఎగబడకుండా ఉంటారా? అవసరమైతే పది రూపాయల వడ్డీకి అప్పు చేసిన అయినా కొంటారు. 40 రోజుల పాటు మద్యం దొరక్కపోతే మూడు నాలుగు రెట్లు పెట్టి బ్లాక్ లో మందు కొనుక్కున్న జనం... రేట్లు పెంచితే వెనక్కు తగ్గుతారు అనుకోవడం మూర్ఖత్వం. ప్రభుత్వానికి కూడా ఇది తెలుసు. అయినా పైకి అలా చెబుతారు అంతే.

నిన్న ఒక్కో షాపు 10 నుంచి 15 లక్షల రూపాయల మద్యం అమ్మింది. సాధారణంగా 3-4 లక్షలు మాత్రమే అమ్ముతారు. అంటే 25 శాతం రేట్లు పెంచినా మూడు రెట్ల అమ్మకాలు పెరిగాయి. వ్యసనపరుడిని ధరలు పెంచి కంట్రోల్ చేయాలనుకోవడం అమాయకత్వం. మందు తాగితే ఖర్చవుతుంది అనుకునే వాడు అసలు మందు అలవాటే చేసుకోవడు. ఇది కామన్ సెన్స్. పైగా ఈ ధరలు పెంచితే... ఇంట్లోకి ఇచ్చే సొమ్ము ఆపేసి సంపాదించిన సొమ్ముతో ఎంత వస్తే అంత కొని తాగుతారు. ఇలాంటి వారిని అలుసుగా తీసుకుని ఇప్పటికే ఏపీలో నాటు సారా కేంద్రాలు వెలిశాయి. వార్తల్లో చూశాం. నాటుసారా లీటరు 80 రూపాయలకు అమ్ముతున్నారట పల్లెల్లో.  సర్కారు మద్యం ధరలు పెంచితే నాటు సారా కొంటారు. నాటు సారాను అరికట్టడం దాదాపు అసాధ్యం. ఒకవేళ మద్యాన్ని నిషేధించినా ఆ కల్తీ నాటు సారా తాగి ఆరోగ్యం పాడు చేసుకుంటాడు. అంతేగాని తాగుబోతు మందు మానడు. అంటే... ప్రభుత్వం దుకాణాలు ఎత్తేయకుండా మద్యం ధరలు పెంచడం వల్ల ఏం ఉపయోగం ఉండదు. అసలు దుకాణాలు మూసేసినా కూడా పెద్దగా ప్రయోజనం ఉండదు. పైగా మన రాష్ట్రంలో ఒక్క కడప జిల్లా తప్ప ప్రతి జిల్లాకు ఇతరు రాష్ట్రాలతో సరిహద్దు ఉంది. అక్కడకెళ్లి తాగొస్తారు. లేదా కొనుక్కుని వస్తారు. అంతేగాని తాగడం ఆపరు. ఇవన్నీ పట్టించుకోకుండా ప్రభుత్వం తమ గుడ్డి వాదాన్ని సమర్థించుకుంటూ మరో 50 శాతం పెంచింది. 

వాస్తవానికి ఇదంతా ఒక గేమ్. ప్రభుత్వ పథకాలు అమలుచేయడానికి  గవర్నమెంటు వద్ద డబ్బులేదు. దీంతో పేదలకు పేదల డబ్బే ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టింది. అందుకే రేట్లు పెంచి ప్రజలకు వివిధ పథకాల రూపంలో ఇస్తున్న డబ్బును ఇలా తిరిగి గుంజేస్తోంది. ఓట్లు జగన్ కి, మద్యం జనాలకి అనే రాజకీయ పథకమే గాని ... ఇది మద్యనిషేధం చేసే మార్గం కాదు. నాలుగేళ్లలో 5 స్టార్ హోటళ్లు తప్ప ఎక్కడా మద్యం దొరకదు అని జగన్ చెబుతున్నారు. ఇంకా వైన్ షాపులు ఉండగానే నాటు సారా వెలిసినపుడు మొత్తం బంద్ చేస్త నాటు సారా ఉండదా? దానిని ఎలా నివారిస్తారు. ఎక్సైజ్ అధికారులకు లంచాలు దొరికే అవకాశాలు సృష్టించడానికి తప్ప ఈ ధరల పెంపు, నిషేధం ఎందుకు పనికి రాదు. నిజంగా ప్రభుత్వానికి మద్య నిషేధం చేసే ఉద్దేశం ఉంటే... ఈ 40 రోజుల బ్యాన్ ని శాశ్వతంగా చేసేసేది. అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేది. కానీ అలా చేయలేదు అంటే ప్రభుత్వానికి మద్య నిషేధంపై ఉన్న చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతుంది.