టాప్ కమెడియన్ చేసిన పనికి ప్రశంసలు

August 07, 2020

అప్రమత్తతకు మించిన మందు కరోనాకు లేదనే చెప్పాలి. వ్యాక్సిన్ లేని ఈ మహమ్మారిని నిలువరించటానికి ఎవరికి వారు తమ వ్యక్తిగత స్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటే ఈ మాయదారి వైరస్ కు దూరంగా ఉండే అవకాశం ఉంది. భయంతోనో.. బెదిరిపోయో.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే తమను తాము నష్టపర్చుకోవటమే కాదు.. చుట్టూ ఉన్న వారికి.. సమాజాన్ని దారుణంగా దెబ్బ తీసినట్లు అవుతుంది. ఈ కారణంతోనే.. కరోనా విషయంలో అప్రమత్తత చాలా అవసరం అంటున్నారు.
మన దేశంలో పుట్టని ఈ వైరస్ ను వ్యాప్తి చెందకుండా ఉండటానికి.. విదేశాల నుంచి వచ్చిన వారు స్వీయ క్వారంటైన్ చేసుకోవటానికి మించింది మరొకటి ఉండదు. ఎందుకంటే.. ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశించినంతనే ప్రభావం చూపించదు. కొందరు చూపించినా.. మరికొందరి విషయంలో మాత్రం గరిష్ఠంగా 17 రోజుల వరకూ కూడా దీని లక్షణాలు బయటకు వచ్చే అవకాశం లేదు.
ఈ కారణంగా విదేశాలకు వెళ్లి వచ్చిన వారు.. విదేశీయులతో కలిసిన వారు.. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా ఇంటి పట్టునే ఉండి.. తమ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో చెక్ చేసుకోవటం చాలా అవసరం. తాజాగా అలాంటి పనే చేసి అందరి ప్రశంసలు పొందుతున్నారు టాలీవుడ్ టాప్ కమెడియన్ ప్రియదర్శి. తాజాగా అతగాడు జార్జియాలో జరిగిన ప్రభాస్ సినిమా షూటింగ్ లో పాల్గొని హైదరాబాద్ కు వచ్చాడు.
కరోనా లక్షణాలు ఏమీ లేకున్నా.. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా పద్నాలుగు రోజులు ఇంట్లోనే ఉండిపోవాలని.. స్వీయ హౌస్ అరెస్టు చేసుకోవాలని డిసైడ్ చేశారు. ఇదే విషయాన్ని ట్విట్టర్ లో వెల్లడించారు. తనకు తాను క్లీన్ చిట్ ఇచ్చుకునేందుకు.. బాధ్యతగా పద్నాలుగు రోజులు ప్రజలకు దూరంగా ఉండాలని తాను భావిస్తున్నట్లు చెప్పిన ప్రియదర్శి ట్వీట్ కు సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇతగాడి మాదిరి ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకుంటే.. కరోనా ముప్పును చాలామేర తప్పించుకునే వీలుందని చెప్పక తప్పదు.