ఇదే జరిగితే ప్రియాంక భారీ సాహసం చేసినట్లే..!

January 27, 2020

గుజరాత్ రాష్ట్రానికి ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసి.. దేశానికి ప్రధానిగా చేసిన నరేంద్ర మోడీని ఢీ కొట్టేందుకు ప్రియాంకా వాద్రా సిద్దమవుతోందట. వారణాసిలో ప్రధానమంత్రి నరేంద్రమోడీని ప్రియాంక వాద్రా ఢీ కొడుతుందనే వార్తలు వెలువడుతున్నాయి. దీంతో నరేంద్ర మోడీ- ప్రియాంకా ఢీ విషయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నిజానికి ప్రజలు పెట్టుకున్న ఆశల మధ్య ఐదేళ్ల క్రిందట ప్రధాని పీఠమెక్కిన మోడీ.. ఆ తర్వాత తన పాలనా విధానంతో ప్రజాబలం కోల్పోయారు. ఈ నేపథ్యంలో ప్రియాంక ఆయనపై పోటీకి దిగుతుండటం హాట్ టాపిక్ అవుతోంది.

అయితే ఈ విషయం మీద ప్రియాంకనే ఆరా తీసింది మీడియా. ‘వారణాసిలో మోడీ మీద పోటీ చేస్తారా?’ అనే ప్రశ్నకు ప్రియాంక సమాధానం ఇస్తూ.. ‘పార్టీ ఆదేశిస్తే ఎక్కడ నుంచి అయినా పోటీ’ అనే సమాధానం ఇచ్చింది. ఇది కొంచెం డొంకతిరుగుడు సమాధానమే అని చెప్పాలి. పోటీ చేయడం చేయకపోవడం ప్రియాంక ఉత్సాహం ఆమె ఇష్టం అవుతుంది. ఆమె పోటీ చేయాలని అనుకుంటే పార్టీ కాదంటుందా? నెహ్రూ-గాంధీ వారసులకు కాంగ్రెస్ లో ఎదురు చెప్పే వాళ్లు ఉంటారా? మోడీని ఎంపీగా ఓడించాలని ఆమె గట్టిగా అనుకుంటే.. ఆయన మీద పోటీ చేయాలి. అంతే కానీ.. ’పార్టీ ఆదేశిస్తే’ అంటూ పాత కాలం మాటలు మాట్లాడితే జనాలు నమ్మే పరిస్థితి లేదు. గత ఎన్నికల్లో వారణాసి నుంచి మోడీ మీద పలువురు పోటీ చేశారు. వారిలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధాన కార్యదర్శి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఉన్నారు. మోడీ మీద పోటీ చేసి బాగానే ఓట్లను సంపాదించుకున్నారు కేజ్రీవాల్. రెండు లక్షలకు పైగా ఓట్లు వచ్చాయి. రెండో స్థానం కేజ్రీకే దక్కింది. ఆ సమయంలో బీఎస్పీ కూడా వారణాసిలో పోటీ చేసింది. దీంతో కొంత ఓట్ల చీలక తప్పలేదు.

అయితే ఈ సారి గనుక యూపీలోని అన్ని పార్టీలు కాంగ్రెస్ కలిసి ఉమ్మడి అభ్యర్థిని వారణాసిలో మోడీ మీద నిలబెడితే పోటీ రంజుగా ఉంటుంది. ప్రియాంక ఆ అభ్యర్థి అయితే మరింత రసవత్తరంగా ఉంటుంది. ఈ అంశాలపై పూర్తి క్లారిటీ త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. చూడాలి మరి మోడీని ప్రియాంక ఎలా ఢీ కొడుతుందో!