సినిమా డిజాస్టరైనా నిర్మాత బిందాస్

May 30, 2020

ఆయన టాలీవుడ్లో ఒక సీనియర్ నిర్మాత. దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఉన్నాడు. పలుకుబడి బాగానే ఉంది. తరచుగా వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటాడు. అందులో ఆర్థిక పరమైనవే ఎక్కువ. ఆయనతో పెట్టుకోవడానికి ఇండస్ట్రీ జనాలు భయపడుతుంటారు. బేనర్ల పేర్లు మారుస్తూ ఆయన సినిమాలు చాలానే తీశారు. కానీ వాటిలో మెజారిటీ ఫ్లాపులు, డిజాస్టర్లే. ఆయన సెట్ చేసే కాంబినేషన్లే చాలా చిత్రంగా ఉంటాయి. ఫామ్‌లో లేని హీరోలను, ఔట్ డేట్ అయిపోయిన డైరెక్టర్లను పెట్టుకుని సినిమాలు తీయడం ఆయనకు సరదా. సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉన్న ఈ నిర్మాత.. ఎలా నిర్మాతగా కొనసాగుతున్నాడు, డబ్బులు ఎలా సమకూరుస్తాడు అన్నది ఇండస్ట్రీ జనాలకు అంతుబట్టని విషయం. 

రాజకీయ, వ్యాపార రంగాల్లోని ప్రముఖులతో ఉన్న పరిచయాలతో వాళ్ల బ్లాక్ మనీని తీసుకొచ్చి సినిమాల్లో పెట్టుబడిగా పెడుతుంటారనే ఆరోపణ ఆయన మీద ఉంది. కాబట్టే సినిమా పోయినా పెద్దగా బాధ పడ్డట్లు కనిపించడని, ఆ ప్రభావం ఏమీ కనిపించకుండా సినిమాలు చేసుకుపోతుంటాడని అంటారు. ఒకప్పటితో పోలిస్తే ఈ నిర్మాత గత కొన్నేళ్లలో కాస్త పెద్ద స్థాయిలో, వరుసగా సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్నాడు. గత ఏడాది ఆయన్నుంచి రెండు సినిమాలొచ్చాయి. అవి రెండూ ఔట్ డేటెడ్ సినిమాలే. అందులో ఒకటి ఒక బడా స్టార్‌తో తీసింది. దానికి కాలం కలిసొచ్చి ఓ మాదిరిగా ఆడింది. ఇంకోటి మాత్రం పెద్ద డిజాస్టర్ అయింది. ఒక యువ కథానాయకుడి కెరీర్‌కు ఆ సినిమా పెద్ద దెబ్బే అయింది. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన దర్శకుడు.. ఈ సినిమా తర్వాత అడ్రస్ లేకుండా పోయాడు. 

ఈ సినిమా దారుణమైన నష్టాలు మిగిల్చినప్పటికీ.. పెద్దగా పట్టించుకోకుండా ఆయన ఇంతకుముందు సినిమా చేసిన కాంబినేషన్లోనే ఈ ఏడాది మరో సినిమా లైన్లో పెట్టాడు. సెట్స్ మీద ఉండగానే ఈ సినిమా ఆడదనే అభిప్రాయం అందరిలోనూ కలిగింది. అందుకు తగ్గట్లే ఈ మధ్యే రిలీజైన ఆ సినిమా డిజాస్టర్ టాక్‌ తెచ్చుకుంది. సినిమా ఆడే అవకాశాలు ఎంతమాత్రం కనిపించడం లేదు. బడ్జెట్ బాగానే పెట్టారు. కానీ బిజినెస్ అవ్వలేదు. దీంతో పెద్ద మొత్తంలో డెఫిషిట్ వచ్చింది. చాలా వరకు సొంతంగా రిలీజ్ చేసుకోవాల్సి వచ్చింది. నిర్మాతకు అటు ఇటుగా రూ.20 కోట్ల దాకా నష్టం అంటున్నారు. కానీ ఆయన వ్యవహారం తెలిసిన వాళ్లు ఈ ఫలితం ఆయన్నేమీ పెద్దగా ఇబ్బంది పెట్టదంటున్నారు. ఎప్పట్లాగే ఆయన బిందాస్ అని.. త్వరలోనే ఇంకో సినిమా సెట్ చూసి తనేంటో చూపిస్తారు చూడండంటూ సవాల్ విసురుతున్నారు ఇండస్ట్రీ జనాలు.