మహేష్ పరువు తీసేస్తున్న నిర్మాత

May 25, 2020

ఒక స్టార్ హీరో వీరాభిమాని సదరు హీరోతో సినిమాను నిర్మించడం అరుదుగా జరుగుతుంటుంది. ఇలా జరిగినపుడు వాళ్ల ఎగ్జైట్మెంట్ మామూలుగా ఉండదు. తన ఆరాధ్య హీరోను గొప్పగా చూపించడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేస్తారు. ఈ కోవలో ఇంతకుముందు బండ్ల గణేష్ కనిపించేవాడు. పవన్ కళ్యాణ్‌కు డైహార్డ్ ఫ్యాన్ అయిన బండ్ల ఆయనతో తీసిన ‘గబ్బర్ సింగ్’ రిలీజైనపుడు ఎంత హడావుడి చేశాడో తెలిసిందే. ఐతే ఇప్పుడు అనిల్ సుంకర అని నిర్మాత బండ్లను మించి పోతున్నాడు. ఆయన మహేష్ బాబుకు పెద్ద ఫ్యాన్. తన అభిమాన హీరోతో ఇంతకుముందు ‘దూకుడు’, ‘1 నేనొక్కడినే’, ‘ఆగడు’ సినిమాలు తీశాడు. ‘దూకుడు’ అప్పట్లో పెద్ద బ్లాక్ బస్టరే కానీ.. అది ఇండస్ట్రీ హిట్ అంటూ అప్పట్లో ప్రచారం చేయడం అతిగా అనిపించింది జనాలకు. తర్వాతి రెండు చిత్రాలూ డిజాస్టర్లు కావడంతో ఏం మాట్లాడటానికి లేకపోయింది.

ఐతే ఇప్పుడు చాలా విరామం తర్వాత మహేష్‌తో ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాన్ని నిర్మించాడు అనిల్. ఈ సినిమాకు ముందు నుంచి హైప్ ఉంది. ఆ హైప్‌కు తగ్గట్లే ఓపెనింగ్స్ కూడా వచ్చాయి. కానీ అనిల్ సుంకర మాత్రం ఉన్నదాన్ని ఎక్కువ చేసి చూపించి.. ఈ సినిమా గురించి అతిగా ప్రచారం చేసి మహేష్‌ను బాగా ఇబ్బంది పెట్టేస్తున్నాడు. తన స్థాయికి తగని రీతిలో ఈ సినిమా రిలీజైనప్పటి నుంచి ఆయన వేస్తున్న ట్వీట్లు మహేష్ అభిమానులకే ఇబ్బందికరంగా అనిపిస్తున్నాయి. బాక్సాఫీస్ అనే అమ్మాయికి మొగుడు వచ్చాడంటూ ఆయన ఒక ట్వీట్ వేయడం గమనార్హం. ఇక ఈ సినిమా కలెక్షన్ల వివరాలతో వేస్తున్న పోస్టర్ల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. 

సంక్రాంతి విజేత ‘అల వైకుంఠపురములో’ అనే విషయంలో మరో మాట లేదు. దీంతో పోలిస్తే దాదాపు పాతిక కోట్లకు తక్కువ కాకుండా షేర్ కలెక్ట్ చేసిందా చిత్రం. ఆ చిత్ర బృందం చెప్పుకున్నట్లు అది ఇండస్ట్రీ హిట్టా కాదా అన్నది త్వరలోనే క్లారిటీ వస్తుంది. ఆ రికార్డును కొట్టిందా లేదా అన్నది పక్కన పెడితే.. దానికి చేరువగా ఉన్న మాట మాత్రం వాస్తవం. కాబట్టి వాళ్లు అలా ప్రచారం చేసుకోవడంలో తప్పేమీ లేదు. కానీ బ్రేక్ ఈవెనే అతి కష్టం మీద సాధించి.. నాన్ బాహుబలి రికార్డుకు దరిదాపుల్లో కూడా లేని ‘సరిలేరు నీకెవ్వరు’ను ‘నాన్ బాహుబలి ఇండస్ట్రీ  బ్లాక్‌బస్టర్’ అంటూ ప్రచారం చేసుకోవడం టూమచ్‌. ఇదంతా అనిల్ పనే. ఇలాంటి ఫేక్ ప్రచారాలతో తమ హీరో పరువు తీసేస్తున్నాడంటూ మహేష్ అభిమానులే ఆయనపై మండిపడుతుండటం గమనార్హం.