ఏపీ స్పీకర్ తమ్మినేని రాజ్యాంగాన్ని అతిక్రమించారా?

August 03, 2020

ప్రభుత్వాల మనసు నొచ్చుకోకుండా చాలా చాకచక్యంగా రాజకీయ విశ్లేషణలు చేసే నేర్పు ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ ది. చంద్రబాబుకు అదేపనిగా వ్యతిరేకం కాదు గాని... జగన్ తప్పులను గట్టిగా ఎత్తిచూపడంలో కొంచెం జంకుతారు. అయితే ఉన్నంతలో ఎంతో కొంత మేలనిపించేలా విశ్లేషణలు చేస్తారు కె.నాగేశ్వర్. చాలా సీనియర్ కావడం, కాస్త కమ్యూనిస్టు భావాలున్న నేత కావడంతో తన పాత అనుభవాలు రంగరించి ఆసక్తికరంగా విశ్లేషణలు చేసే నాగేశ్వర్ తాజాగా మాత్రం ఏపీ స్పీకర్ తీరును తీవ్రంగా తప్పు పట్టారు.

ఒక టీవీ ఛానెల్ డిబేట్ లో భాగంగా... కోర్టులపై ఏపీ స్పీకర్ తమ్మినేని చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. కోర్టుల నుంచి పాలిస్తారా? ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలుండగా... కోర్టుల జోక్యం ఎందుకు అంటూ తమ్మినేని సీతాారాం తన పరిధిని అతిక్రమించారు అంటూ నాగేశ్వర్ వ్యాఖ్యానించారు. నాపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చినా పర్లేదు కానీ తమ్మినేని సీతారాం కచ్చితంగా తన పరిధిని అతిక్రమించారని నాగేశ్వర్ వ్యాఖ్యానించారు.

వైసీపీ నేతగా అనిపించుకోవాలనే ఉబలాటం తమ్మినేనికి బాగా ఉందని, కావాలంటే ఆయన రాజీనామా చేసి మంత్రిగా చేరి ఎలా కావాలాంటే అలా మాట్లాడొచ్చు గాని స్పీకర్ గా మాత్రం తన పరిధిలో తాను ఉండాలన్నారు. రాజ్యాంగం వల్ల ఉనికిలో ఉన్న మూడు వ్యవస్థలు ప్రభుత్వం- చట్టసభలు -కోర్టులు అని... కోర్టులు ప్రభుత్వంలో జోక్యం చేసుకుంటాయని చట్టసభల నాయకుడు అనడం రాజ్యాంగ అతిక్రమణ అన్నారు.

సుప్రీంకోర్టులో కేసు వేస్తే తమ్మినేని పదవికే ముప్పు వాటిల్లేటువంటి వ్యాఖ్యలు తమ్మినేని సీతారాం చేశారని నాగేశ్వర్ అన్నారు. ప్రజలు నేరుగా ముఖ్యమంత్రిని ఎన్నుకోవాలి... ఇక కోర్టులు, ఎమ్మెల్యేలు, శాసనసభలు ఉండకూదు అన్నట్లు సీతారాం అభిప్రాయపడుతున్నారని... స్పీకర్ ఏ పార్టీకి చెందని వ్యక్తిగా హుందాగా వ్యవహరించాలన్నారు.