అడ‌గ‌టానికి వ‌చ్చినా అరెస్ట్ చేస్తారా కేసీఆర్‌?

June 01, 2020

ఇంట‌ర్ బోర్డు నిర్వాకం తెలంగాణ రాష్ట్ర ప్ర‌జ‌ల్లో తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంది. దాదాపు 10 ల‌క్ష‌ల‌కు పైగా విద్యార్థుల జీవితాల్ని ప్ర‌భావితం చేసే ఈ ఉదంతంపై విద్యార్థుల త‌ల్లిదండ్రులు.. బంధువులు.. మిత్రుల నుంచి వెల్లువెత్తుతున్న నిర‌స‌న‌లు అంత‌కంత‌కూ పెరుగుతున్నాయి. ఇంట‌ర్ ఫ‌స్ట్ ఇయ‌ర్ లో పాస్ అయిన ఒక అమ్మాయి.. సెకండ‌ర్ ఇయ‌ర్ లో పాస్ అయిన‌ట్లు.. ఫ‌స్ట్ ఇయ‌ర్ లో ఫెయిల్ అయిన‌ట్లుగా మార్కుల మెమో వ‌చ్చింది.
మ‌రొక‌రి విష‌యంలో మార్కులు తేడా ప‌డ్డాయి. ఇంకొక‌రి విష‌యంలో ప‌రీక్ష రాసినా.. అబ్సెంట్ అని మార్కుల లిస్ట్ రిలీజ్ చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే వంద‌లాది మంది ప్ర‌స్తావిస్తున్న స‌మ‌స్య‌ల్ని వింటుంటే.. వారి త‌ప్పుకంటే కూడా బోర్డు త‌ప్పే ఎక్కువ‌గా ఉంద‌న్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం.
త‌మ‌కొచ్చిన ఇబ్బందుల్ని ఇంట‌ర్ బోర్డు అధికారుల్ని అడిగేందుకు బోర్డు వ‌ద్ద‌కు వ‌స్తున్న విద్యార్థుల్ని.. వారి త‌ల్లిదండ్రుల్ని పోలీసులు ఇష్టారాజ్యంగా అరెస్ట్ చేస్తున్నార‌న్న మాట టీవీ ఛాన‌ళ్ల‌లో చెబుతుండ‌టాన్ని ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు. పిల్ల‌లు.. వారి త‌ల్లిదండ్రులు ఏమైనా సంఘ విద్రోహ శ‌క్తులా? లేక‌.. వారేమైనా నేరం చేశారా? ఆ మాట‌కు వ‌స్తే.. నిజానికి వారంతా బాధితులు.
త‌మ బాధ‌కు కార‌ణం తెలుసుకోవ‌టానికి.. త‌మ త‌ప్పు లేకున్నా.. త‌మ‌ను బాధితులుగా ఎందుకు చేశార‌ని ప్ర‌శ్నించ‌టానికి వ‌చ్చిన‌ప్పుడు వారికి న్యాయం జ‌రుగుతుంద‌న్న ధీమాను ఇచ్చి పంపాల్సింది పోయి.. భారీ ఎత్తున పోలీసుల్ని మొహ‌రించేసి.. అదుపులోకి తీసుకోవ‌టం వ‌ల్ల ఏమైనా న్యాయం జ‌రుగుతుందా? అన్న‌ది ప్ర‌శ్న. త‌మ‌కు క‌లిగిన క‌ష్టం గురించి తెలుసుకోవ‌టానికి వెళ్లిన సామాన్యుల్ని సైతం అదుపులోకి తీసుకుంటున్న పోలీసుల తీరు చూస్తే.. అరే అడ‌గ‌టానికి వ‌చ్చినా అరెస్ట్ చేస్తారా? ఇదేం రాజ్యం.. ఇదేం రాజ్య‌మ‌న్న తెలంగాణ ఉద్య‌మం నాటి నినాదం చ‌ప్పున గుర్తుకు రాక మాన‌దు.