జగన్ పదవులిచ్చినవారిలో ఫస్ట్ రాజీనామా ఇదే..

February 26, 2020

ఆదివారం ఉదయం నుంచి మీడియాలో, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయిన ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీరాజ్ సరస శృంగార సంభాషణల ఆడియో టేపుల దెబ్బకు సాయంత్రమయ్యేసరికి ఆయన పదవి పోయింది. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత కీలకమైన ఈ పదవి అందుకున్న ఆయన ఇచ్చినంత సేపు కూడా పదవిని నిలబెట్టుకోలేకపోయారు. నోటి దురద కారణంగా వ్యతిరేకులను పెంచుకున్న ఆయన చివరకు స్వల్పకాలంలోనే పదవిని కోల్పోవాల్సి వచ్చింది. ఎస్వీబీసీకి చెందిన ఓ ఉద్యోగినితో ఫోన్‌లో ఆయన జరిపినట్లుగా చెబుతున్న సరస సంభాషణలు లీవకడంతో తాజాగా ఆయన రాజీనామా చేశారు. దీంతో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత పదవులు పొందినవారిలో రాజీనామా చేసిన మొట్టమొదటి వ్యక్తయ్యారు పృథ్వీరాజ్.
రాజీనాయా అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ పదవికి తనను రాజీనామా చేయమని వైసీపీ అథిష్ఠానం తనను ఆదేశించలేదని, స్వచ్ఛందంగానే రాజీనామా చేశానని చెప్పారు. తనపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేయాలని టీటీడీని తానే స్వయంగా కోరానని, అదే విధంగా, పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పారు.
పద్మావతి గెస్ట్ హౌస్ లో తాను మద్యం సేవించినట్టు, ఎస్వీబీసీ ఉద్యోగినితో అసభ్య సంభాషణ చేసినట్టు వచ్చిన ఆరోపణలను ఖండిస్తున్నానని చెప్పారు. తనపై వచ్చిన ఆరోపణలకు బాధపడుతున్నానని అన్నారు. తనకు మద్యం తాగే అలవాటు లేదని, తన బ్లడ్ శాంపిల్స్ తీసుకుని పరీక్షంచుకోవాలని తనపై ఆరోపణలు చేసిన వారికి సవాల్ విసిరారు.
కాగా పృథ్వీరాజ్ వ్యవహారం వివాదాస్పదం కావడంతో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఈ విషయాన్నిజగన్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పృథ్వీని వెంటనే రాజీనామా చేయమని చెప్పాలని జగన్ ఆదేశించినట్లు సమాచారం. కాగా, టేపుల వ్యవహారం ఘటనపై విజిలెన్స్ విచారణ జరుగుతోంది. టేపులు ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపి పూర్తిస్థాయి విచారణ చేయాలని వైవీ సుబ్బారెడ్డి ఆదేశించారు.