సీఎం జగన్ పై పృథ్వీ షాకింగ్ కామెంట్స్?

June 01, 2020

త‌న‌పై వ‌చ్చిన `ఆడియో టేపు` ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ఎస్వీబీసీ ఛైర్మన్ ప‌ద‌వికి ప్ర‌ముఖ సినీ న‌టుడు, వైసీపీ నేత పృథ్వీరాజ్ రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ ఛానల్ ఉద్యోగినితో పృథ్వీ అసభ్యకరంగా మాట్లాడార‌ని ఆరోప‌ణ‌లున్న ఆడియో క్లిప్ వైరల్ కావడంతో స్వ‌చ్ఛందంగా త‌న ప‌ద‌వికి  పృథ్వీ రిజైన్ చేశారు. త‌న‌ను ఈ వ్య‌వ‌హార‌లో కావాల‌ని ఇరికించార‌ని, ఆ ఆరోప‌ణ‌లు త‌న‌ను మాన‌సికంగా ఇబ్బందికి గురిచేశాయ‌ని, చేయ‌ని త‌ప్పుకు తాను మాన‌సిక క్షోభ అనుభ‌వించాన‌ని పృథ్వీ వ్యాఖ్యానించారు. ఎస్వీబీసీని  ప్రక్షాళన చేసేందుకు తాను చేసిన ప్ర‌య‌త్నాల వ‌ల్లే త‌నకు కొందరు వెన్నుపోటు పొడిచి పైశాచికానందం పొందార‌ని షాకింగ్ కామెంట్స్ చేశారు.

కొంతకాలంగా మీడియాకు దూరంగా ఉంటోన్న పృథ్వీ ...తాజాగా టిక్ టాక్ వీడియోతో మరోసారి వార్తల్లోకి వచ్చారు. ప్రస్తుతం ఎవరినీ నమ్మే పరిస్థితులు లేవని...కల్తీ వ్యక్తులు పాలిస్తున్న కాలమిది అంటూ  పృథ్వీ షాకింగ్ కామెంట్స్ చేశారు.  పృథ్వీ రాజ్ పై వచ్చిన ఆరోపణల వ్యవహారంలో వైసీపీ అధినేత జగన్ సీరియస్ గా ఉన్నారని, ఆ విషయంలో  పృథ్వీకి చివాట్లు పెట్టారని పుకార్లు వచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా టిక్ టాక్‌లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి.

సీఎం జగన్ ను ఉద్దేశించిన పృథ్వీ ఆ టిక్ టాక్ చేశారని టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతూ విమర్శిస్తున్నారు. కల్తీ నాయకులు అంటే ఎవరని...పృథ్వీ వైసీపీ నుంచి ఎప్పుడు బయటకు వచ్చారో అని ప్రశ్నిస్తున్నారు. ఇది తాతల నాటి యుగం కాదని, కల్తీ నాయకులు ఏలుతున్న కలియుగం అని పృథ్వీ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపుతున్నాయి. మన ముందు మన మాట...వేరొకరి ముందు వారి మాట మాట్లాడతారని, జాగ్రత్తగా ఉండాలని పృథ్వీ చేసిన వ్యాఖ్యలు జగన్ ను ఉద్దేశించినవేనని అంటున్నారు. ఆ ఆరోపణల వ్యవహారం తర్వాత వైసీపీతో అంటీముట్టనట్టుగా ప‌ృథ్వీ ఉంటున్నారు. ఆ ఆరోపణల విషయంలో సీఎం జగన్ తనకు అండగా నిలవలేదని...అసలేం జరిగిందో తెలుసుకోకుండా.. ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని పృథ్వీ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పృథ్వీ టిక్ టాక్ లో చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అయితే, పృథ్వీ ఆ టిక్ టాక్ లో కేవలం ఓ సినిమాలో డైలాగ్ మాత్రమే చెప్పారని...కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.