పదవి ఇచ్చినా... పృథ్వీలో అసంతృప్తి ఎందుకు....?

February 19, 2020

30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ.....తెలుగు చిత్రసీమలో పరిచయం అక్కరలేని పేరు. చిత్రసీమలో అంచెలు అంచెలుగా ఎదుగుతూ మంచి కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఒకవైపు కమెడియన్ గా మెప్పిస్తూనే మరో వైపు రాజకీయాల్లో కీలక నేతగా ఎదగడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రకి మద్ధతు తెలిపిన ఆయన...ఆ తర్వాత ఎన్నికల్లో కాలుకి బలపం కట్టుకుని మరి వైసీపీ నాయకుడిగా...ఆ పార్టీ తరుపున ప్రచారం చేశారు. అడపాదడపా మీడియా ముందుకొచ్చి అపోజిషన్ పార్టీ టీడీపీపై, ఆ పార్టీ నేతలపై ఓ రేంజ్ లో తిట్ల వర్షం కురిపించారు.

ఇక ఎన్నికల్లో వైసీపీ అత్యధిక సీట్లు గెల్చుకుని జగన్ సీఎం అయిపోయారు. ఈ క్రమంలోనే జగన్ పార్టీ నేతలకి కొన్ని కీలక పదవులు అప్పగించారు. అలాగే టీడీపీపై తీవ్ర విమర్శలు చేసిన పృథ్వీకి కూడా... ప్రతిష్టాత్మకమైన టీటీడీకి చెందిన ఎస్వీబీసీ భ‌క్తి ఛానెల్‌ చైర్మన్ పదవి ఇచ్చారు. అయితే పదవి ఇచ్చాక ఆయన సైలెంట్ గా పని చేసుకుంటున్నాడు అనుకుంటే పొరబాటే. ఆయన టార్గెట్ ఎస్వీబీసీ చైర్మన్ పదవి కాదని...ఇంకేదో ఆయన మనసులో ఉందని....కేవలం ఈ పదవితో సంతృప్తి పడటం లేదని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

ఎస్వీబీసీ చైర్మన్ అయినా పృథ్వి మాటల దాడి ఆగలేదు. ఈ సారి అపోజిషన్ పార్టీని కాకుండా టాలీవుడ్ లోని సినీ పెద్దలని టార్గెట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి అంతటి మెజారిటీతో గెలిచి సీఎం అయినా టాలీవుడ్ పెద్దలు ఎవరు స్వయంగా వచ్చి ఆయన్ని అభినందించలేదని విమర్శలు గుప్పించారు. ఒకవేళ చంద్రబాబు నాయుడు రెండోసారి ముఖ్యమంత్రి అయితే.. ఇండస్ట్రీ పెద్దలుగా చెప్పుకుంటున్న వాళ్లంతా కట్ట కట్టుకొని వచ్చి చంద్రబాబుకు సన్మాన కార్యక్రమం చేసేవారని, జగన్ ముఖ్యమంత్రి కావడాన్ని ఇండస్ట్రీ పెద్దలు ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.

అక్క‌డితో ఆగ‌కుండా జ‌నాలు భ‌విష్య‌త్తులో సినిమా వాళ్ల‌కు ఓట్లేయ‌వ‌ద్ద‌ని కూడా పృథ్వి పిలుపు ఇచ్చారు.
పైగా తను వైసీపీకి మద్ధతు తెలిపిన దగ్గర నుంచి సినిమాల్లో తనని కావాలనే తోక్కెస్తున్నారని...అవకాశాలు రాకుండా చేస్తున్నారని ఆరోపణలు చేశారు. అయితే ఇవన్నీ పృథ్వీ పైకి మాట్లాడినా....లోపల ఆయన టార్గెట్ మాత్రం వేరు అని ఇండ‌స్ట్రీలోనే కొంద‌రు చర్చించుకుంటున్నారు. జగన్ దృష్టిలో పడి ఇంకా పెద్ద పదవి సాధించాలని పృథ్వీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

అసలు రాజకీయంగా పెద్దగా ఉపయోగం లేని ఎస్వీబీసీ చైర్మన్ పదవి ఇవ్వడం పట్ల ఆయన అసంతృప్తితో ఉన్నట్లు అనిపిస్తోంది. అదేగాక ప్రభుత్వంలో కీలకంగా ఉండే ఎమ్మెల్సీ పదవిపైనా పృథ్వీ గురి పెట్టినట్లు తెలుస్తోంది. అందుకే అటు అపోజిషన్ పార్టీలపై, ఇటు టాలీవుడ్ పెద్దలపై విమర్శలు చేస్తూ...జగన్ దృష్టిలో పడి ఇంకా పెద్ద పదవి కొట్టేయాలని చూస్తున్నారని సమాచారం. చూద్దాం మరి రానున్న రోజుల్లో పృథ్వీకి ఎలాంటి పదవి దక్కుతుందో...?

Read Also

ఆర్టికల్ 35ఏలో ఏముంది? దాన్ని ఎందుకు రద్దు చేశారు?
బాబుపై ఇద్దరు సీఎంల రాజకీయం.. టార్గెట్ 6 నెలలు !
రష్మి లేకపోతే నాకు లైఫ్ లేదు - సుధీర్ !