పవన్ సినిమా పేరు అదే అంటున్నారు... 

August 08, 2020

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కంబ్యాక్ మూవీ హిందీ పింక్ అన్న సంగతి తెలిసిందే. సినిమాలు చేయను.. ఇక ఫోకస్ అంతా రాజకీయమీదనే అని చెప్పినప్పటికీ.. తన చుట్టూ తనను నమ్ముకున్న వారి కోసం తాను సినిమాల్లో చేస్తున్నట్లు చెప్పిన పవన్.. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒకేసారి మూడు సినిమాలకు ఓకే చెప్పి హాట్ టాపిక్ గా మారారు.
తీరిక లేని పొలిటికల్ బిజీలో ఉన్నప్పటికీ.. తన సమయాన్ని సర్దుబాటు చేసుకొని సినిమాల్లో వరుస పెట్టి నటిస్తున్నారు. సినిమాలు చేసే సమయంలోనూ పవన్ ఇంత స్పీడ్ గా సినిమాలు చేసింది లేదు. అలాంటి ఆయన.. తన తీరుకు పూర్తి భిన్నంగా వరుస పెట్టి సినిమాలు తీస్తున్నారు. ఆయన నటిస్తున్న బాలీవుడ్ పింక్ మూవీ మీద ఆసక్తికర వార్తలు వస్తున్నాయి.
పవన్ తో సినిమా చేయాలన్న దిల్ రాజు కల నెరవేరటం ఒక ఎత్తు అయితే.. పవన్ చేసిన సినిమాల్లో అతి తక్కువ డేట్లు ఇచ్చిన సినిమా ఇదేనని చెప్పాలి. ఈ సినిమా పేరును అధికారికంగా అనౌన్స్ చేయనప్పటికీ.. అనధికారికంగా మాత్రం లాయర్ సాబ్ అన్న పేరుతో ప్రచారం జరుగుతోంది. అయితే.. లాయర్ సాబ్ పేరును తాము అస్సలు అనుకోలేదని.. ఆ మాటకు వస్తే ఈ సినిమాకు తాము ఎలాంటి పేరును ఇప్పటివరకూ చర్చించుకోలేదని చెబుతున్నారు చిత్ర నిర్మాత దిల్ రాజు.
హిందీలో మాదిరే.. పింక్ పేరును తెలుగులోనూ కంటిన్యూ చేస్తారా? అంటే అలాంటిదేమీ లేదన్నారు. అసలు ఆ సినిమాకు ఏం పేరు పెట్టాలన్న విషయం మీద ఇంకా ఆలోచించలేదని చెప్పారు దిల్ రాజు. అయితే.. హిందీ.. తమిళంలో మాదిరి కాకుండా తెలుగులో కొన్ని మార్పులు చేస్తున్నామని.. సినిమాను మరో కోణంలో చూపిస్తున్నామని చెబుతున్నారు. రీమేక్ ను యథాతధంగా కాకుండా మార్పులు చేయటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చివరకు సినిమా ఎలా వస్తుందో చూడాలి.