జగన్ గురించి పురంధేశ్వరి షాకింగ్ వ్యాఖ్యలు 

April 06, 2020

పీపీఏ ఒప్పందాల సమీక్ష, రాజధాని అమరావతి, పోలవరం రివర్స్ టెండరింగ్ సహా వివిధ అంశాలపై వైసీపీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి, చంద్రబాబుపై ఎలా పగ తీర్చుకోవాలా అని చూస్తోందని తెలుగు తమ్ముళ్లు ఆరోపిస్తున్నారు. తొమ్మిది నెలలుగా టీడీపీ టార్గెట్‌గా జగన్ రివర్స్ పాలన కొనసాగిస్తున్నారని ఎద్దేవా చేస్తున్నారు. తాజాగా, బీజేపీ నేతలకు కూడా జగన్ అసమర్థత అర్థమవుతోంది. బీజేపీ నేత, చంద్రబాబు బద్దశత్రువు పురందేశ్వరి కూడా టీడీపీ నేతల వ్యాఖ్యలను సమర్థించేలా స్పందించారు.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం కక్షపూరిత పాలన తప్ప అభివృద్ధి మాత్రం కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. రివర్స్ టెండరింగ్‌తో పోలవరం ప్రాజెక్టు పనులు ఎక్కడికి అక్కడే నిలిచిపోయాయన్నారు. మూడు రాజధానుల ప్రకటనతో పెట్టుబడులు రాకపోవడం పక్కన పెడితే, వచ్చినవి కూడా వెనక్కి వెళ్తున్నాయన్నారు. ప్రభుత్వం విధానాల వల్ల పరిశ్రమలు  వచ్చే పరిస్థితి కనిపించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక లోటు ఉంటే పథకాలు ఎలా అమలు చేస్తారని నిలదీసారు. మండలి రద్దు వల్ల ఉపయోగం లేదని ఉపయోగం లేదని చెబుతున్న వైసీపీ తొలి భేటిలోనే ఎందుకు తీర్మానం చేయలేదో చెప్పాలన్నారు.
గత టీడీపీ హయాంలో పురంధేశ్వరి నిత్యం టీడీపీని, చంద్రబాబును టార్గెట్ చేసుకున్నారు. చంద్రబాబుతో ఉన్న బంధుత్వం నేపథ్యంలో.. ఆయన లక్ష్యంగా మాట్లాడినా, ఆయనను సమర్థించేలా మాట్లాడినా అది చర్చనీయాశంగా మారటం ఖాయం. ఇప్పుడు, ఓ వైపు వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే టీడీపీకి కూడా చురకలు అంటించారు.
తొలి సమావేశంలోనే మండలిని ఎందుకు రద్దు చేయలేదని జగన్ ప్రభుత్వాన్ని నిలదీసిన పురంధేశ్వరి... ఈ రద్దు విషయాన్ని టీడీపీ నేతలు ప్రశ్నించడాన్ని కూడా తప్పుబట్టారు.  వైసీపీ, టీడీపీలు ప్రజల విశ్వాసం కోల్పోయాయన్నారు. ఆ రెండు పార్టీలతో ఎలాంటి పొత్తు ఉండదని, జనసేనతో కలిసి ముందుకు సాగుతామన్నారు.